అనుమతి లేకుండా ధాన్యం పెద్దపల్లికి.. | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా ధాన్యం పెద్దపల్లికి..

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

పెద్దపల్లికి ధాన్యం తరలింపులో గోల్‌మాల్‌

అనుమతి లేకుండానే పొరుగు జిల్లాకు

గత డీసీఎస్‌వోపై విజిలెన్స్‌ శాఖ చర్యలు

రెండు మిల్లులకు లబ్ధి చేకూర్చి.. చిక్కుల్లో అధికారి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం తరలింపులో గతంలో జిల్లాలో పని చేసిన పౌరసరఫరాల శాఖ అధికారికి ఉచ్చు బిగుస్తోంది. జిల్లా నుంచి బదిలీపై వెళ్లి ప్రస్తుతం మరో జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నా జిల్లాలో ధాన్యం సేకరణలో చేసిన తప్పిదాలకు బాధ్యులు కావాల్సి వస్తోంది. పౌరసరఫరాల శాఖ గత కొంతకాలంగా ఆ అధికారిపై విచారణ చేపట్టింది. నోటీసులు ఇచ్చింది. సదరు అధికారి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో చర్యలకు సిఫారసు చేసింది. తాజాగా విజిలెన్స్‌ విభాగం ఆ అధికారికి మెమో జారీ చేసింది. దీంతో జిల్లా నుంచి నిబంధనలు ఉల్లంఘించి ధాన్యం పొరుగు జిల్లాకు పంపిన అధికారిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసేందుకు రంగం సిద్ధమైంది. అప్పట్లో మంచిర్యాలతోపాటు పెద్దపల్లి జిల్లాకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తూ కొంతమంది మిల్లర్లతో దోస్తీ చేశారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయి ప్రస్తుతం మరో జిల్లాలో పని చేస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా జిల్లా ధాన్యం కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు గుర్తించి తాజాగా చర్యలకు ఉపక్రమించారు.

కనువిప్పు కలిగేనా?

జిల్లాలో రైస్‌మిల్లులు తక్కువగా ఉండడంతో ధాన్యం సేకరణ లక్ష్యం ఏటేటా పెరుగుతోంది. మరోవైపు మిల్లులు సకాలంలో బియ్యం అందించకపోవడంతో బ్లాక్‌లిస్టు, డీఫాల్ట్‌గా మారడం, యాజమాన్యాలపై ఆర్‌ఆర్‌యాక్టు, క్రిమినల్‌ కేసులతో మూతపడ్డాయి. దీంతో నిల్వలకు ఇబ్బందులతో పొరుగు జిల్లాలైన పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలకు ధాన్యం పంపిస్తున్నారు. అక్కడి రైస్‌మిల్లర్ల సంఘ నాయకులతో ముందే ములాఖత్‌ అయి వారు ఎంపిక చేసిన మిల్లులకే ధాన్యం తరలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌తోపాటు సిద్దిపేట జిల్లాలో పని చేసిన అనుభవం ఉన్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారు. ఎంపిక చేసిన మిల్లుల ట్యాగింగ్‌లో భారీగా ముట్టినట్లుగానే ఆరోపణలున్నాయి. జిల్లా నుంచి సన్న రకం వడ్లు, నాణ్యమైన ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు గత మూడేళ్లుగా పంపిస్తున్నారు. నిల్వలకు ఇబ్బందిగా చూపుతూ ఇతర జిల్లాలకు పంపిన ధాన్యంతో మళ్లీ బియ్యం అప్పగింత, ధాన్యం రవాణాకు కాంట్రాక్టర్‌ బిల్లులు ప్రభుత్వంపై పడుతోంది. కాంట్రాక్టర్‌ బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సంటేజీతో వసూళ్లు జరుగుతున్నాయి. గత వానాకాలంలో సన్న వడ్ల కోసం పొరుగు జిల్లా మిల్లర్లు పోటీ పడగా, ‘టన్ను’ కొంత చొప్పున ఓ లెక్క కట్టి ఆయాచిత లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. గత పౌరసఫరాల శాఖ అధికారిపై విచారణ జరుగుతున్న తరుణంలో మరోసారి అధికారులు తప్పటడుగులు వేయకుండా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

మూడేళ్ల క్రితం జిల్లా పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ 2022–23 రబీ సీజన్‌లో రైతు నుంచి సేకరించిన 17వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని పొరుగు జిల్లాకు పంపారు. రెండు మిల్లులకు ట్యాగింగ్‌ ఇస్తూ కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కింద ఆ ధాన్యాన్ని అప్పగించారు. అయితే ఆ మిల్లర్లు ఆ ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. ఈ ధాన్యం రూ.39 కోట్ల విలువగా ఉంది. అంతా బాగానే ఉన్నప్పటికీ ధాన్యం పొరుగు జిల్లాలకు పంపాలంటే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి అనుమతి ఉండాలి. అప్పటికే స్థానిక గోదాంలో ఉన్న ధాన్యాన్ని పొరుగు జిల్లాలో ఉన్న మిల్లర్లకు లబ్ధి చేకూరేలా అప్పగించారు. దీంతో సీఎంఆర్‌ కింద బియ్యం బాకీ పెట్టకుండా పెద్దపల్లి జిల్లాకు చెందిన రెండు మిల్లులు జాప్యం చేశాయి. యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ధాన్యం కేటాయింపులోనే అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు బాధ్యులపై చర్యలకు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement