ఒత్తిడిని తట్టుకోలేక పిల్లల బలవన్మరణాలు తల్లిదండ్రులకు తప్పని మానసిక క్షోభ పిల్లలపై దృష్టి సారించాలంటున్న నిపుణులు
మంచిర్యాలక్రైం: పలకా బలపం చేతబట్టి బడికెళ్లాల్సిన వయస్సు.. అభం శుభం తెలియని అమాయకపు మనస్సు.. జనన, మరణాల గురించి అవగా హన లేని మైనర్లు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. తమకు ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూసుకుని భయాందోళనకు గురై మానసిక ఒత్తిడితో క్షణికావేశంలో మొగ్గ దశలోనే నిండు జీ వితాలను ముగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన బాలబాలికల ఆత్మహత్యలు ఆందోళన కలి గిస్తున్నాయి. కన్నవారికి ఆవేదన మిగిలిస్తున్నాయి.
ఒత్తిడిని తట్టుకోలేక..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకోలేక లేత వయసులో అనేకమంది తనువు చాలిస్తున్నారు. వందకు వంద మార్కులు రావాలని, నువ్వు డాక్టర్ కావాలని, కలెక్టర్ కావాలని, పెద్ద పోలీసాఫీసర్ కావాలని చిన్నానాటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలపై తలకు మించిన భారం మోపుతున్నారు. కాదంటే ఏమంటారోనని భయపడిన చిన్నారులు మానసికంగా కుంగిపోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్ గేమ్స్, రీల్స్, అతిగా ఫోన్లు చూడడం వల్ల, బయట ఎవరితోనో గొడవ, స్నేహితులతో పోలికలు, కొన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడువలు, స్కూల్‌లో ఏదైనా సమస్య ఉందని చెబితే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని, నాకు చదువు రావడంలేదని కొందరు ఇంతటి చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూసి సోషల్ మీడియా ప్రభావంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు రావడం సమాజాన్ని భయకంపితులను చేస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మవిమర్శ చేసుకోవాలని పలువురు మేధావులు భావిస్తున్నారు.


