అడవితల్లి.. కంటతడి! | - | Sakshi
Sakshi News home page

అడవితల్లి.. కంటతడి!

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

గూడేల్లో కానరాని సౌకర్యాలు

తాగునీటికి ఇప్పటికీ తిప్పలే

విద్య, వైద్యపరంగానూ వెనుకబాటే

హక్కుల కోసం ఆగని పోరాటం

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

గుక్కెడు నీటికి తిప్పలే..

వేసవి వచ్చిందంటే చాలు ఆదివాసీలు ఏటా తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో కానరాని పరిస్థితి. గుక్కెడు నీటికోసం నెత్తిన బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి. చేదబావుల వద్ద గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని చెలిమనీటితో గొంతు తడుపుకోవాల్సి వస్తోందని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కైలాస్‌నగర్‌/ఆదిలాబాద్‌రూరల్‌/ఉట్నూర్‌రూరల్‌: అడవితల్లిని నమ్ముకుని ప్రకృతి ఒడిలో జీవించే ఆదివాసీలు ఏళ్లుగా సమస్యలతో సహవాసం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా గిరిపుత్రుల బతుకుల్లో మాత్రం ఇంకా వెలుగులు కనిపించని పరిస్థితి. ఇప్పటికీ తాగునీటి కష్టాలు వెంటాడుతుండగా.. కరెంటు లేని గ్రామాలు సైతం అనేకం ఉన్నాయి. విద్య, వైద్యపరంగానూ వెనుకబాటే కనిపిస్తోంది. పాలకులు మారుతున్నా తమ బతుకులు మార డం లేదని..హక్కులు, అస్తిత్వం కోసం అడవిబిడ్డలు నిత్యం పోరుబాట పడుతూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల స్థితిగతులపై ప్రత్యేక కథనం.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఐటీడీఏ పరిధిలోని 170కిపైగా గిరిజన గూడెలకు ఇప్పటికీ విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే నిత్యం అవస్థలే. వంతెనలు లేక వాగులు, వంకలు పొంగిన క్రమంలో రోజుల తరబడి ఆదివాసీలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. విధిలేని పరిస్థితుల్లో వాగులు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారెందరో. 108, 102 వాహనాల సంగ తి అటుంచితే చాలా గ్రామాలకు కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అవస్థలు వర్ణనాతీతమే. సుమారు 40కి పైగా ఆదివాసీ గామాల్లో ఇప్పటికీ కరెంట్‌ వసతి లేకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

చదవులోనూ వెనుకబాటే..

ఆదివాసీలకు విద్యాపరంగా వెనుకబాటు తప్పడం లేదు. గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఏళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేక సీఆర్టీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఉట్నూర్‌ కేంద్రంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ మరో చోటికి తరలించడంతో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కుల కోసం నిరీక్షణ..

జల్‌.. జంగల్‌..జమీన్‌ నినాదంతో సాగిన భూపోరాటం స్ఫూర్తిగా ఆదివాసీలు ఏళ్లుగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 1/70, పీసీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు భూములపై సర్వహక్కులు ఉంటాయి. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–2006 చట్టం ప్రకారం భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పలుమార్లు హక్కుపత్రాలను ప్రభుత్వాలు అందించినప్పటికీ పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. వాటికోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తమపై అటవీ అధికారుల వేధింపులు పెరిగాయని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం పెరుగుతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు సైతం చేపడుతూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement