రామకృష్ణాపూర్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయం వద్ద ఆదివారం బోనాల జాతర నిర్వహించనున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మందమర్రి మండలంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ ఇలవేల్పుగా భావించే గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జాతరకు పెద్ద సంఖ్యలోనే ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. జాతీయ రహదారి పక్కనే మైసమ్మ ఆలయం ఉండడంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతర కొనసాగనుంది. మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
భారీ పోలీసు బందోబస్తు
జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలతోపాటు సుమారు 200 మంది పోలీసులతో భద్రత పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తదితర అంశాలపై శనివారం సాయంత్రం క్యాతనపల్లి ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సిబ్బందికి పలు సూచనలు చేశారు.


