మంచిర్యాలఅర్బన్: చిట్టిబుర్రలో మెదిలిన ఆలోచనలకు పదును పెడితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీతకు యేటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్‌స్పైర్ మనక్ పేరిట విజ్ఞాన మేళా నిర్వహిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో ఇన్‌స్పైర్ మనక్‌కు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం కల్పిస్తుంది. 2026–27విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్బా, గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ప్రతీ పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు అవకాశం కల్పిస్తారు. ప్రయోగాలను ఎంపిక చేసి దశలవారీగా అవార్డులు అందిస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పోటీపడే ఆస్కారం ఉంటుంది. సెప్టెంబర్ 15లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ప్రతీ పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు
ప్రతీ పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు విద్యార్థుల ఆలోచనను అనుసరించి అందజేయాల్సి ఉంటుంది. బడిలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి ఆలోచనలు రేకెత్తించి అందులో రాసి వేస్తే టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ఆ ఆలోచనను అనుసరించి ప్రాజెక్టుల రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఆలోచనను ఆహ్వానించి అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
వినూత్న ప్రాజెక్టులు
రూపొందించాలి
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటా ఇన్‌స్పైర్ మనక్ అవార్డు పోటీలు నిర్వహిస్తోంది. పర్యావరణ రక్షణ, సామాజిక సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలను చూపగలిగే సృజనాత్మకత ప్రాజెక్టుల ఆలోచనలతో కూడిన వాటిని విద్యార్థులు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికితీతకు పోటీలు దోహదం చేస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు చొరవ చూపాలి.
– రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి
గత ఏడాది రాష్ట్రంలో రెండోస్థానం
2025–26 విద్యాసంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1345 ప్రదర్శన ప్రాజెక్టులు అందించి జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. జిల్లా స్థాయి పోటీల్లో 90 ప్రాజెక్టులను ఎంపిక చేసి 90మంది విద్యార్థులకు రూ.10వేల చొప్పున ఆర్థికసహాయం వారి ఖాతాల్లో జమ చేశారు. విద్యార్థులు ఆ నిధులతో ప్రాజెక్టులు రూపొందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించాల్సి ఉంటుంది.


