మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయని ప్రభుత్వం వరి సాగు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. అయినా రైతాంగం వరి సాగుకే ముందడుగు వేస్తోంది. గత నెలాఖరు వరకు వర్షాలు లేక బీడువారిన పొలాలు ప్రస్తుతం వరి నాట్లతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, జలాశయాలు నిండాయి. దీంతో ఇప్పటికే వరి నారు పోసిన రైతులు నాట్లు వేసుకోగా.. మరికొందరు ఇప్పుడిప్పుడే నారు పోస్తున్నారు. ప్రస్తుత వర్షాలతో వరి సాగు చేస్తే రానున్న రోజుల్లో నీటితడులకు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల నీటితడులు, వాతావరణ పరిస్థితుల్లో దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్కువ నీటితడులు అవసరమయ్యే ఆరుతడి పంటలు కంది, పెసలు, మొక్కజొన్న, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు. అయినా ఇప్పటివరకు రెండు వేల ఎకరాల్లోపే ఆరుతడి పంటలు సాగయ్యాయి. జూలై నెలాఖరులో భారీ వర్షాలతో బోరుబావులు, ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు చేయడంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలోని దండేపల్లి మండలంలో లోటు వర్షపాతం నెలకొనగా.. ఎనిమిది మండలాల్లో అధికంగా, తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆ లస్యమైనా భారీ వర్షాలు కురవడంతో పొలాల్లో ఎ క్కడ చూసినా నాట్లతో కూలీల సందడి నెలకొంది.
ఇంకా మొలక అలుకుతున్న రైతులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 3.52 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1,71,351 ఎకరాల్లో పత్తి, 14,762 ఎకరాల్లో వరి సాగైంది. మరో 57,360 ఎకరాల కోసం నారు పోసుకున్నారు. ఇంకా కొందరు రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. మొలక అలుకుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురవక నీటితడులు అందక పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నా తగ్గడం లేదు. జిల్లాలో 75శాతం నల్లరేగడి నేలలు, నీరు ఎక్కువగా నిలిచే నేలలు ఉన్నాయి. వరిసాగుకు అనుకూలంగా పొలం గట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి నేలల్లో ఆరుతడి పంటలకంటే వరిసాగే అనుకూలమని రైతులు భావిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే నీరు నిలిచి ఆరుతడి పంటలు మునిగి నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు.
మార్కెట్ సౌకర్యం ఉండదని..
వరి సాగు చేయకుంటే తిండికి తిప్పలు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఏటా వానాకాలంలో వరి సాగు చేస్తామని, ఇతర పంటలను పందులు దక్కనివ్వవని, పంట దిగుబడి అమ్ముకోవాలన్నా మార్కెట్ సౌకర్యం ఉండదని చెబుతున్నారు. వరి సాగు చేస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో విక్రయించే వీలుంటుంది. సన్నరకం బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆరుతడి పంటలకు సరైన మద్దతు ధర, స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేదనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. వ్యవసాయ అధికారులు కంది, పెసర, మినుము, మొక్కజొన్న తదితర విత్తనాలు రైతువేదికల్లో అందుబాటులో ఉంచారు. ఉద్యానశాఖ అధికారులు రాయితీపై కూరగాయల విత్తనాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కా నీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఇప్పటికే జిల్లాలో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులతో అవగాహన కల్పిస్తే మిగతా రైతులకు నమ్మకం కలిగించవచ్చు. ఖరీఫ్‌కు ముందస్తు కొందరు రైతులు పెసర పంట సాగు చేసి జూలైలో దిగుబడి సాధించారు. మరికొందరు కూరగాయలు సాగు చేసి లాభాలు ఆర్జించారు. తక్కువ సమయంలో పంట దిగుబడి, తక్కువ నీటితడులతో సాగు చేశారు. అధికారుల సూచనలకంటే సాగు చేసి దిగుబడి సాధించిన రైతులతో ప్రచారం, ముఖాముఖి నిర్వహించడం వల్ల ఆరుతడి పంటల వైపు అడుగులు పడే అవకాశం ఉంది.


