చెన్నూర్: చెన్నూర్ పట్టు పరిశ్రమాభివృద్ధికి అడ్డంకిగా మారిన ఫారెస్ట్ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ పరిశ్రమ జాయింట్ డైరెక్టర్ లత, ఏడీ పార్వతి, శాస్త్రవేత్త కిరణ్‌కుమార్, క్లస్టర్ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. బిజీ షెడ్యూల్ కారణంగా సీఎంను కలిసేందుకు వీలు కాకపోవడంతో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డిని కలిశారు. తెలంగాణలో అటవీ ప్రాంతాల్లో పట్టు పురుగుల పెంపకం, డీఎఫ్‌ఎల్‌ల పంపిణీ, రైతుల జీవనోపాధిపై ఏర్పడిన ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పట్టు పరిశ్రమ అధికారులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన తిరుపతిరెడ్డి పట్టు పరిశ్రమ ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పట్టు రైతుల ఉపాధి, జీవనోపాధి విషయంలో త్వరలోనే సీఎంను కలుస్తామని పట్టు పరిశ్రమ అధికారులు తెలిపారు.


