పట్టు వదలం! | - | Sakshi
Sakshi News home page

పట్టు వదలం!

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

దసలి పట్టు రైతుల పోరుబాట!

జిల్లాలోనే అత్యధిక కాయల ఉత్పత్తి

అటవీశాఖ అనుమతి నిరాకరణ

ఆగ్రహిస్తున్న ఆదివాసీ గిరిజనులు

జిల్లాను దిగ్బంఽధిస్తామని హెచ్చరిక

చెన్నూర్‌: దసలి పట్టు కాయలు సాగు చేసే ఆదివాసీ గిరిజన రైతులు పోరుబాట పడుతున్నారు. సాగుకు అటవీశాఖ అనుమతివ్వకుంటే జిల్లాను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మంచిర్యాలతో పాటు కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాల్లో రైతులు పట్టు కాయలు ఉత్పత్తి చేస్తున్నారని, మిగతా జిల్లాల్లో లేని అట వీశాఖ ఆంక్షలు ఈ జిల్లాపై ఎందుకంటున్నారు. తమకు ఉపాధి కల్పించాల్సిన సర్కారు ఇలా వ్యవహరించడమేమిటని ఆవేదన వ్యక్తంజేస్తున్నారు.

చెన్నూర్‌ పట్టు కాయలకు డిమాండ్‌

రైతులు మూడు నెలలకో పంట చొప్పున ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. నాలుగు జిల్లాల్లో 10 వేల హెక్టార్లలో సుమారు 5వేల మంది రైతులు ప ట్టు కాయలు ఉత్పత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో సుమారు 90లక్షల కాయలు ఉత్పత్తి అవుతుండగా, ఒక మంచిర్యాల జిల్లాలోనే రైతులు 60–70 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని చెన్నూర్‌ పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో ఏ డాదికి రైతులు రూ.3.75కోట్ల ఆదాయం గడిస్తున్నా రు. పైగా, ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పట్టుకాయల కు మంచి డిమాండ్‌ ఉంది. దేశంలోనే చెన్నూర్‌ ప ట్టుకాయలు ప్రత్యేకగుర్తింపు పొందడం గమనార్హం.

ఆంక్షలతో తగ్గిన ఆదాయం

భూములు లేని గిరిజన రైతులు అనాదిగా వస్తున్న వృత్తితో జీవనం సాగిస్తుండగా ఫారెస్ట్‌ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మూడేళ్ల క్రితం చెన్నూర్‌ పట్టు పరిశ్రమ పరిధిలో 60–70 లక్షల కాయలు ఉత్పత్తి చేసిన రైతులు గతేడాది ఫారెస్ట్‌ అధికారుల ఆంక్షలతో 60వేలకే పరిమితమయ్యారు. మూడేళ్ల క్రితం ఒక్కో రైతు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఆదాయం పొందారు. గతేడాది ఉత్పత్తి తగ్గడంతో ఒక్కొక్కరికి రూ.20వేలు కూడా రాక కుటుంబ పోషణకు ఇబ్బందులకు గురయ్యారు.

ప్రాణహిత వైల్డ్‌లైఫ్‌ సెంచురీ ఏరియాలోనే..

ప్రస్తుతం ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్న కోటపల్లి, వేమనపల్లి మండల్లాలోని ప్రాణహిత సెంచురీ గ్రామాలైన ముల్కలపేట, బొప్పారం, నాగంపేట, లింగన్నపేట, ఎదుల్లబంధం, కొండంపేట, పారుపల్లి, కావర్‌ కొత్తపల్లి, రాజారాం గ్రామాల్లో 60 ఏళ్లుగా గిరిజన రైతులు దసలి పట్టు కాయలు ఉత్పత్తి చేస్తున్నారు. నల్లమద్ది చెట్లు ఎక్కువ శాతం డీప్‌ ఫా రెస్ట్‌ ప్రాంతాల్లో కాకుండా అటవీ ప్రారంభంలోనే విరివిగా ఉంటాయి. ఇప్పటివరకు దసలి పట్టు రైతులు ఏనాడు వన్యప్రాణులకు హాని తలపెట్టిన దా ఖలాలు లేవు. తాము పట్టు కాయలు ఉత్పత్తి చేసే తొమ్మిది నెలల కాలంలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లు అడవిలోకి వచ్చేందుకు భయపడతారని రైతులు చెబుతున్నారు. తాము అటవీ సంరక్షకులుగా నిలిచామే గాని ఏనాడు ఫారెస్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని పేర్కొంటున్నారు. ఫారెస్ట్‌ రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు దసలి పట్టు కాయలు ఉత్పత్తి చేసేందుకు తమకు ఫారెస్ట్‌ అనుమతి ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement