మంచిర్యాలఅర్బన్: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న టీజీ బ్రేక్‌ఫాస్ట్(అల్పాహారం), మధ్యాహ్న భోజన పథకం ఇక నుంచి ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి విద్యార్థులతోపాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం తక్షణమే విస్తరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,805 మంది విద్యార్థులతోపాటు 3,499 మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి వర్తింపజేయనున్నారు. అవసరమైన మార్పులు చేయాలని మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులకు సమయం ఆదాతోపాటు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వల్ల పాఠశాలల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
పోర్టల్‌లో మార్పులు
ఉపాధ్యాయులు, సిబ్బంది భోజనం, టిఫిన్ వినియోగ వివరాల నమోదుకు ఎండీఎం, టీజీ బ్రేక్‌ఫాస్ట్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. రోజువారీ బ్రేక్‌ఫాస్ట్, తీసుకున్న సిబ్బంది సంఖ్య రోజువారీగా భోజనం చేసిన టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది అనేది తేదీవారీగా వినియోగ రికార్డు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్జేడీ, డీఈవో, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, సెంట్రలైజ్డ్ కిచెన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు ఇచ్చారు.
పారదర్శకత కోసం..
టీచర్లు, నాన్‌టీచింగ్‌కు ఇవ్వడం వల్ల ఎలా ఉందని అంచనా వేయడానికి ఉపయోగపడనుంది. ఎవరు భోజనం చేస్తున్నారు, ఎంతమంది అనేది స్పష్టత రానుంది. ఎంతమందికి వండాలి అనేది తేలిపోనుంది. అవసరానికి మించి సరుకులు తీసుకోవడం లేదా లెక్కల్లో తేడాలు రావడం నివారణకు దోహదపడనుంది. పోర్టల్ లాగిన్‌లో మార్పులు చేసిన వెంటనే బయోమెట్రిక్, రోజువారీ వినియోగ రికార్డుల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య ఆధారంగా బడ్జెట్, రేషన్ కేటాయింపులు ఉంటాయి.
సెంట్రలైజ్డ్ కిచెన్
పనులు వేగవంతం
పాఠశాలల్లో ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం మొదట అందిస్తారు. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమల్లోకి రాగానే విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మంచిర్యాల మెడికల్ కాలేజీ ఆవరణలో పాఠశాలల్లో బ్రేక్‌పాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణం చివ రి దశకు చేరుకోవడంతో ఆగస్టులో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అత్యాధునిక యంత్రాలతో పరిశుభ్రమైన వాతావారణంలో ప్రతిరోజూ వేలాది మంది పిల్లలకు నాణ్యమైన టిఫిన్ తయారీ, సరఫరా బాధ్యతలను హరేకృష్ణ మూవ్‌మెంటు చారిటబుల్ ట్రస్టు(ఇస్కాన్ సంస్థ)కు అప్పగించారు. పనులు పూర్తికాగానే అల్పాహార పథకం అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు రోజువారీ పోషకాహార లోపం తీరడమే కాకుండా హాజరుశాతం కూడా పెరుగనుంది.


