‘ఎస్డీసీ’ ఉత్తర్వులు సమర్థించిన ట్రైబల్ కోర్టు
ఏజెన్సీలో ఉన్న ఫంక్షన్‌హాల్ స్వాఽధీనంపై సమర్థన
గత ఉత్తర్వులను అమలు చేయాలంటూ తహసీల్దార్‌కు ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ఏజెన్సీ పరిధిలో కొనసాగుతున్న మందమర్రి శివారు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇందూ గార్డెన్ యాజమాన్యానికి మరోసారి ఉట్నూరు ఐటీడీఏ పీవో కోర్టులో చుక్కెదురైంది. గతంలో ఫంక్షన్ హాల్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా స్థానిక తహసీల్దార్ అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. 2016లో ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘంతో సహా మొత్తం తొమ్మిది మంది వేర్వేరుగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ)కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఫంక్షన్ హాల్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లగా, ఎస్డీసీకే మరోసారి విచారణ చేసి తేల్చాలంటూ ఆదేశాలు ఇచ్చింది. మరోసారి విచారణ అనంతరం ఎస్డీసీ గతేడాది డిసెంబర్ 21న తుది ఉత్వర్వులు ఇచ్చారు. సర్వే నంబరు 350/2/4 పరిధిలో నిర్మాణాలతో సహా మొత్తం 2.10ఎకరాలను స్వాధీనం చేసుకోవాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై మరోసారి అప్పీల్‌కు వెళ్లగా అప్పీల్‌దారు వాదనను తోసిపుచ్చుతూ ఫంక్షన్ హాల్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ఉట్నూర్ ఐటీడీఏ, పాజెక్ట్ ఆఫీసర్ కోట్టు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. అయితే ఈ కేసులో అప్పీలుదారుడు తన తండ్రి 1968లో సాదాబైనామాలో ఈ భూమిని కొనుగోలు చేశామని వాదించారు. కానీ రికారుల్లో ఆ భూమి దశాబ్దాలుగా గిరిజనుల పట్టాదారులుగా ఉన్నట్లు తేలింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో కొనుగోలు చేసినట్లు మున్సిపల్ రికార్డుల్లో రుజువైంది. 1968నుంచే తన ఆధీనంలో ఉందని చెబుతూ మళ్లీ 2016లో కొనుగోలు చేసినట్లు చూపడం విరుద్ధంగా మారింది. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమిని ఆక్రమించడం లేదా బదిలీ చేసుకోవడం 1959/1970 నిబంధనలకు విరుద్ధంగా భావిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రైబల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ గత పదేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి విజయం దక్కిందని ఆదివాసీ నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గంజి రాజన్న, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
అడ్డగోలుగా నిర్మాణాలు
మందమర్రి పట్టణం, శివారు ప్రాంతాల్లో ఏజెన్సీ చట్టాన్ని తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. స్థానికంగా రాజకీయ అండదండలు, పలుకుబడితో అనేక నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు మున్సిపల్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలకు జరిమానాలు వేస్తూ ఇంటి నంబర్లు ఇస్తుండడంతో ప్లాట్లలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఏజెన్సీలో రియల్ వ్యాపారులు సైతం అన్ని అనుమతులు ఇప్పిస్తామంటూ జాతీయ రహదారి పొడువునా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అయితే కొనుగోలు చేశాక అనేక మంది చిక్కుల్లో పడుతున్నారు. మందమర్రిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను నియంత్రించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.


