ఇక విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ఇక విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్ష

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

● ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌లో.. ● రెండు నుంచి ఐదోతరగతి వరకు.. ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2–5 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు విద్యాశాఖ ఈ నెల 23, 24 తేదీల్లో ప్రాథమిక పరీక్ష (బేస్‌లైన్‌) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అభ్యసన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు నిర్వహించనున్న పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 581 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 19,830 మంది విద్యార్థులు చదువుతున్నారు. 484 ప్రైమరీ పాఠశాలల్లో 16,213 మంది, 97 అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలో 3,617 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 50 స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిధిలో అత్యధికంగా విద్యార్థులున్న పాఠశాలల్లో బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం పాఠశాలల్లో పరీక్ష నిర్వహించనుండగా ఎంపిక చేసిన 150 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. విద్యార్థులు చదవడం.. రాయడం, గణిత నైపుణ్యాలను అంచనా వేసిన తర్వాత బోధన ప్రణాళిక రూపొందించనున్నారు.

ఆన్‌లైన్‌లోనే పరీక్ష..

తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది. సంబంధిత ప్రశ్నాపత్రాల సాఫ్ట్‌కాఫీలను నిర్ణీత తేదీలకు ముందే ఈ మెయిల్‌ ద్వారా డీఈవోలకు పంపిస్తారు. వెంటనే ఎంఈవోల ద్వారా వాటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు భాష, గణితంలో అభ్యసన సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని లోపాలను సవరించడంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు అవకాశముంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement