● ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న అటవీ అధికారులు ● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్
జన్నారం: అటవీ శాఖ అధికారులు నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు పన్నుతున్నారని, దాడులు ఆపకపోతే ప్రజలు తిరగబడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి కొమ్ముకాస్తూ అభివృద్ధికి అడ్డంకిగా మారారని, కార్యకర్తలు, నాయకులపై చేయి వేస్తే.. గోదావరి నుంచి తీసిన ఇసుకను అడ్డుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పొనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్‌ను అరెస్టు చేస్తామని ఇంటిపైకి అటవీశాఖ అధికారులు మూకుమ్మడిగా వెళ్లి కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేశారని, ఇప్పుడు తనతోపాటు ఉన్నాడని, హరిత రిసార్టులోనే ఉంటానని, దమ్ము ధైర్యం ఉంటే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఇసుక తీయకుండా ఆపుతూ అభివృద్ధిని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్మినారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్ల, సర్పంచులు వెంకన్న, సురేశ్, పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజ్మీర నందునాయక్, ఎం.మాణిక్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


