
సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ వ్యూ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలు, మంచిర్యాల వరకు పోటెత్తుతున్న గోదావరి వరద నీటి ప్రవాహాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన అరగంట పరిశీలన అనంతరం ప్రాజె క్టు అవతలి వైపు అధికారులతో సమీక్షించారు. కలెక్టర్, ఏసీపీ ప్రాజెక్టు వద్ద వేచి చూశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న భారీ వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారుతోందని, గేట్లు తెరిచి 8లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి నీటిమట్టం, వరద నీటి పరిస్థితులను సమీక్షించారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ఆర్డీవో శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 14.675 టీఎంసీ ల నీరుంది. కడెం ప్రాజెక్టు నుంచి 41వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 3లక్షల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 3లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో 40గేట్లు ఎత్తి దాదాపు 6లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 302 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
ఓసీపీలో ఉత్పత్తి నష్టం
శ్రీరాంపూర్/జైపూర్: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుగనిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, సుమారు 1.5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది. జైపూర్ మండలం ఇందారం ఐకే1ఏ గని, ఐకే–ఓసీపీలో గురువారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఐకే1ఏ భూగర్భగనిలో మధ్యాహ్నం లేఆఫ్ ప్రకటించారు.