
35 శాతం లాభాల వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులకు కంపెనీ సాధించిన లాభాల నుంచి 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులు, డిపార్టుమెంట్లపై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఎస్సార్పీ 3 గనిపై జరిగిన కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, 36 నెలల సర్వీసు ఉండగానే మెడికల్ బోర్డుకు పిలవాలని, తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, గనుల వేలం విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి చెల్లించాల్సిన రూ. 43 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ నాయకులు పెట్టం లక్ష్మణ్, పొగాకు రమేశ్, పానుగంటి సత్తయ్య, అన్వేష్ రెడ్డి, బుస్సు రమేశ్, నాయకులు గొర్ల సంతోష్, గడ్డం మల్లయ్య, తొంగల రమేశ్, అందే రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.