ఇంద్రవెల్లి: నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన జతిన్‌సింగ్‌కు సెంట్రల్ ఫోర్స్‌లో ఉద్యోగంకోసం ఇంద్రవెల్లి చిరునామాపై రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరమైంది. మండల కేంద్రంలోని కొబ్బయ్‌గూడకు చెందిన గేడం భరత్‌ను కలిసి విషయం చెప్పడంతో రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకుని జతిన్‌సింగ్ ఆధార్ కార్డుపై రాజస్థాన్ అడ్రస్‌కు బదులుగా ఇంటినంబర్ 1–42, కొబ్బయ్‌గూడ, ఇంద్రవెల్లి అని మార్పు చేసి తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికెట్ ఇప్పించాడు. విషయం తెలుసుకున్న భీంనగర్‌కు చెందిన ఆచార్య దత్త విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేయడంతో అతని స్నేహితుడు ధరత్‌సింగ్ ద్వారా రూ.10వేలు ఇప్పించాడు. విచారణలో సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో ఇంద్రవెల్లి ఎస్‌బీ కానిస్టేబుల్ కొడప రామారావు ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.