
రోడ్డు ప్రమాదంలో సీఐకి గాయాలు
సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం డోలారా గ్రామం వద్ద గురువారం ఉదయం 11గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై గౌతమ్ పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌గంగ నదిలో వినాయక నిమజ్జనానికి కుటుంబ సమేతంగా భక్తులు భారీగా హాజరయ్యారు. భద్రత పర్యవేక్షణకు సీఐ సాయినాథ్ డ్రైవర్ షబ్బీర్‌తో కలిసి వాహనంలో వెళ్లారు. రాష్ట్ర సరిహద్దు నుంచి పరిశీలిస్తూ డోలారా గ్రామం వద్ద ఆగి ఉన్నారు. ఇంతలో గురుగావ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీ వేగంగా వచ్చి సీఐ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న సీఐ, డ్రైవర్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వాహనం నుజ్జునుజ్జయింది. ఇద్దరిని ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ జీవన్‌రెడ్డి పరామర్శించి ఆరోగ్య స్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.