
పోలీసుల అదుపులో కుంభకోణం సూత్రధారి?
నాలుగు గంటలపాటు బ్యాంక్‌లో బైఠాయింపు
అధికారుల హామీతో ఆందోళన విరమణ
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని ఎస్‌బీఐ బ్రాంచిలో నగలు, నగదు కుంభకోణానికి పాల్పడిన క్యాషియర్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రికవరీపై దృష్టి సారించి జైపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 449మంది రుణం తీసుకోగా.. 402మందికి సంబంధించినవి గోల్‌మాల్ అయ్యాయి. 20 కిలోల 496గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు గల్లంతు కావడానికి ప్రధాన కారణమైన క్యాషియర్ నరిగే రవీందర్, అతడికి సహకరించిన తొమ్మిది మందిని గుర్తించి ఎస్‌బీఐ ఆర్‌ఎం రితేష్‌కుమార్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గత రెండ్రోజుల క్రితం బ్యాంకు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చిన జిల్లాలోని ఆరు ఫైనాన్షియర్లను పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవీందర్‌ను బుధవారం ముంబయి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జైపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు సమక్షంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. బ్యాంకు నుంచి బంగారం తీసుకెళ్లి మిత్రబృందానికి అప్పగిస్తే వారంతా ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి నగదు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆరు ఫైనాన్స్‌ల్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు రికవరీపై దృష్టి సారించినట్లు సమాచారం. బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయా ఏమైనా గోల్‌మాల్ జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు తెలిసింది. నగలు, నగదు గోల్‌మాల్ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తుండడంతో బాధితులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విచారణలో ఏం తేలుతుందోనని ఆతృతతో ఉన్నారు. 90శాతం బంగారు ఆభరణాలు ఎక్కడికీ తరలిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం బంగారం భద్రంగానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోల్డ్‌లోన్ బాధితుల ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ ఎస్‌బీఐ బ్రాంచి–2లో గోల్డ్‌లోన్ బాధితులు గురువారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. రుణం చెల్లిస్తే బంగారం ఇస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేవరకు కదలబోమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల రీజినల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా, రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) విజయభాస్కర్, లీగల్ అడ్వయిజర్ సంజయ్‌కుమార్ జైన్ సాయంత్రం బ్యాంకుకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. బంగారం ఎక్కడికీ పోదని, కేసు విచారణ పూర్తయిన తర్వాత ప్రతీ ఒక్కరికి ఇస్తామని హామీనిచ్చారు. అప్పటివరకు సహకరించాలని కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. బాధితులకు బీఆర్‌ఎస్ నాయకులు రాజారమేశ్ మద్దతు తెలిపారు. స్థానిక ఎస్సై శ్యామ్‌పటేల్ పాల్గొన్నారు.