
జొన్న చేనులో పుస్తకావిష్కరణ
తాంసి: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.ఉదారి నారాయణ రచించిన ‘యాప చెట్టు కాడ ఊరుమీద ముచట్లు’ పుస్తకాన్ని శుక్రవారం జొన్న చేనులో రైతు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండలంలోని సావర్గాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సట్వాజీ తన జొన్నపంట చేనులో పనులు చేస్తుండగా పుస్తక రచయిత ఉదారి నారాయణ మిత్రులతో కలిసి వెళ్లి చేనులోనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సామల వీరన్న, తెలుగు భాష ఉపాధ్యాయులు గంగన్న, గ్రామ పెద్దలు జీవన్, రాములు, గంగయ్య తదితరులు ఉన్నారు.