అమ్మ.. మరో జన్మ ఉంటే నీ కడుపున పుడతా | - | Sakshi
Sakshi News home page

అమ్మ.. మరో జన్మ ఉంటే నీ కడుపున పుడతా

Dec 10 2024 12:35 AM | Updated on Dec 10 2024 2:57 PM

-

510 జీవోతో అన్యాయం జరిగిందని ఆవేదన.. 

 తన చావుతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలని సూసైడ్‌ నోట్‌ 

నిర్మల్‌టౌన్‌: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తనకన్నా జూనియర్లు రెగ్యలర్‌ అయ్యారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగి వకులాభరణం భరత్‌ కుమార్‌ (37) ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భరత్‌ రాసిన ఓ సూసైడ్‌ లేక అందరినీ కంటతడి పెట్టిస్తోంది.‘మా అమ్మానాన్నల కడుపులో పుట్టడం నా అదృష్టం. 

ఎంతో పెద్ద ఉద్యోగం వస్తుందని కలలు కన్నాను. 2018 లో ఆరోగ్యశాఖలో ఆర్‌ఎన్టీసీపీ విభాగంలో సీనియర్‌ ట్రీట్మెంట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందాను. జీవితంలో స్థిరపడతానని ఆశించాను. కానీ నాకన్నా హోదా తక్కువ ఉన్నవారికి ఇదే శాఖలో జీతం ఎక్కువగా రావడం.. నా జీతం మాత్రం పెరగకుండా కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే ఉండిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను. నాతోపాటు నాలాంటి వాళ్లను రెగ్యులర్‌ చేసే విషయంలో జీవో 510 అన్యాయం చేసింది. అప్పటి ప్రభుత్వంలో వచ్చిన ఈ జీవో వల్ల నష్టపోయాం. ఇటీవల జీవో 16 కూడా అమలు చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. 

దీంతో మాకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశా. కానీ అది జరగక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా. నా భార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా. మీ ఇద్దరినీ బాగా చూసుకుంటానని కలలు కన్నా. కానీ ఉద్యోగం రెగ్యులర్‌ కాకపోవడంతో మీకు చెప్పినట్లుగా ముందుకు వెళ్లలేకపోయా. ఇంతకాలం పనిచేసిన కాలంలో నాకు రావాల్సిన పీవోఎల్‌ బకాయిలు నా భార్యకు ఇవ్వండి. నా ఆత్మహత్యతో అయినా మిగతా వారికి న్యాయం జరగాలి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తెలిసేలా చూడండి.

 సహచర ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటా. అమ్మా నాన్న సారీ..’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. భరత్‌ మృతి ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement