చిన్నచింతకుంట/ ఆత్మకూర్/ మదనాపురం: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన అలంకారోత్సవం, ఆభరణాల ఊరేగింపు శనివారం వైభవంగా సాగింది. ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలకు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీస్ కాన్వాయ్‌లో స్వామివారి ఆలయానికి బయలుదేరగా.. మదనాపురం మండలంలోని కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు పూల వర్షం కురిపించారు. ముందుగా గ్రామంలోని ముక్కెర వంశీయులు రాజా శ్రీరాంభూపాల్ నివాసానికి చేర్చగా.. ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణమ్మ, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి సాగిన ఆభరణాల ఊరేగింపుతో భక్తులు పులకించిపోయారు. అమ్మాపురం గ్రామానికి చెందిన నంబీ వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని ఆంబోరు మధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. అక్కడ ఆలయ ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, చైర్మన్ బాలరాజు అధికారుల సమక్షంలో ఆభరణాలను ప్రధాన అర్చకులు వెంకటయ్య, సత్యంలకు అందజేశారు. వారు శ్రీనివాసుడికి చూడముచ్చటగా అలంకరించడంతో కాంచనగుహ కాంతులీనింది.
ఆద్యంతం.. భక్తిభావం
కురుమూర్తిస్వామి ఆభరణాల ఊరేగింపు ఘట్టంలో ఆద్యంతం భక్తిభావం ఉప్పొంగింది. ఆభరణాలకు శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ ఘన స్వాగతం పలికారు. అనేక బాధలతో కుంగిపోయినవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, సంతానం కోసం తపిస్తున్న దంపతులు.. వీరిని తాకడం వల్ల తమ ఈతిబాధలు తొలగిపోతాయని భావిస్తారు. తరతరాల భక్తి విశ్వాసాలకు, కష్టాలను మరిపించే స్పర్శకు గ్రామాల పొడవునా భక్తులు ఆభరణాలకు స్వాగతం పలుకుతూ.. ముందుకు సాగనంపారు.
స్వర్ణాభరణాలంకరణలో ధగధగా మెరిసిన కురుమూర్తిరాయుడు
ఆత్మకూరు ఎస్‌బీఐ నుంచివైభవంగా ఆభరణాల ఊరేగింపు
గ్రామాల్లో అడుగడుగునా స్వాగతం పలికిన ప్రజలు, సంస్థానాధీశులు
హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జీఎమ్మార్, ఇతర ప్రజాప్రతినిధులు
ఉప్పొంగిన భక్తిభావం.. మార్మోగిన గోవింద నామస్మరణ


