గట్టు: పంచాయతీ కార్యదర్శులకు కొత్తగా వచ్చిన ఎంపీడీఓ, ఎంపీఓ మధ్య గట్టులో కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు ఇష్టానూరీతిగా వ్యవహరిస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. కొంతమంది కార్యదర్శులు ఎంపీడీఓ, ఎంపీఓను లెక్కచేయని దాకా వ్యవహారం వచ్చినట్లు సమాచారం. దీనికి తోడు గ్రామసమస్యలను గాలికి వదిలేసి, గ్రామాల్లో కంటే ఎక్కువగా మండల పరిషత్ కార్యాలయంలోనే కాలం గడుపుతున్నారని, మరికొందరూ అసలు గ్రామాల్లో కనిపించరని, ఎక్కడుంటారో కూడా తెలియడం లేదని, కనీసం ఫోన్లలో కూడా స్పందించడంలేదని కొన్ని గ్రామాల ప్రజలు ఆరోపిస్తూ, కొందరిపై నేరుగా ఎంపీడీఓకు ఫిర్యాదులు చేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులిచ్చిన చనువు కారణంగా పంచాయతీ కార్యదర్శులు మాటవినని పరిస్థితి దాకా వచ్చినట్లు ఆరోపణలున్నాయి. పంచాయతీ కార్యదర్శులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో గట్టు మండలం వెనుకడుగులో ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పనితీరు మెరుగు పరుచుకోవాలనే తలంపుతో కొత్తగా వచ్చిన ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఎంపీఓ సయ్యద్ బాసిత్ కార్యదర్శులపై కాస్త కఠువుగా వ్యవహరిస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు కినుక వహించినట్లు సమాచారం. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రతిరోజూ అభివృద్ధి సూచికను మెరుగుపర్చాలని, నిర్లక్ష్యం వహిస్తున్న వారికి షోకాజు నోటీసులను ఇస్తుండడంతోపాటు అవసరముంటే తప్పా మండల పరిషత్ కార్యాలయానికి రావద్దని చెబుతుండడంతో పంచాయతీ కార్యదర్శులు కినుకు వహించినట్లు సమాచారం. పనిభారం కారణంగా తాము విధులను సక్రమంగా నిర్వహించలేక పోతున్నామని, ఇలాగే ప్రతి చిన్నదానికి షోకాజ్ నోటీలిస్తూ, తమపై ఒత్తిడి తీసుకొస్తే తాము పనిచేయలేకపోతున్నామంటూ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రికార్డులను అప్పగించే దాకా వ్యవహారం వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ఖాన్‌ను వివరణ కోరగా.. కార్యదర్శులకు మాకు మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పురోగతి సాధించే విధంగా జూమ్‌కాల్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరం ఉంటే తప్పా మండల పరిషత్ కార్యాలయానికి మధ్యాహ్నం తర్వాత రమ్మని చెప్పాం. ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టడంలేదన్నారు. అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తూ గట్టు అభివృద్ధికి ముందుకుసాగుతామని తెలిపారు.
పనిచేయలేమంటూ చేతులెత్తేస్తున్న కార్యదర్శులు
పనిచేయకుండా తప్పించుకోలేరంటున్న ఎంపీడీఓ
విధులకు దూరంగా కార్యదర్శులు


