పాలమూరు: విద్యార్థి దశ నుంచే చట్టాలు, హక్కులపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, బాలలపై జరిగే వేధింపులను అరికట్టడం, విద్యాహక్కు చట్టం, సైబర్ భద్రత తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరమైన సహాయం పొందే విధానాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు న్యాయమూర్తి బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అంశాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.


