యూత్‌ గేమ్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

యూత్‌ గేమ్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): తెలంగాణ ఆతిథ్యమిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చేలా జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ఖేలో ఇండియా నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేశామని, మరో 15 రోజుల్లో అదనంగా రూ.5 లక్షలు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాల అవసరాలు, అంచనాల మేరకు అదనపు నిధులు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. విడుదలైన నిధులను సమర్థంగా వినియోగించి క్రీడా సంబరాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థల జట్లకు చెందిన యువ క్రీడాకారులు, సహాయక సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ఖుష్బూగుప్తా జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు వసతి, రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇండోర్‌ స్టేడియంలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, డీఆర్‌ఓ నిర్మల, డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చైల్డ్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలోని కొత్త బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘చైల్డ్‌ హెల్ప్‌ డెస్క్‌–1098’ను సోమవారం కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బస్టాండుకు వచ్చే ప్రయాణికుల్లో తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు లేదా ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించి వారికి తక్షణమే భద్రత కల్పించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, ఆర్టీసీ ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌, డిప్యూటీ ఆర్‌ఎంలు కృష్ణమూర్తి, మాధవరావు, డీఎం అశోక్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement