జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 91 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను సావధానంగా విని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాటిలోని అంశాలను పూర్తిగా అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నిర్మల, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


