● గ్రామాలు, పట్టణాల్లో
ప్రత్యేక నమోదు శిబిరాలు
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన లక్ష్యమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. పథకం అమలు, లబ్ధిదారుల గుర్తింపు, నమోదు ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్‌లో సీపీఓ నర్సింహులుతో కలిసి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలను సమగ్రంగా గుర్తించాలని, అర్హులైన ఏ ఒక్కరూ మినహాయించబడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీమా పొందే వ్యక్తి పేరు, వయస్సు, ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సేకరించాలన్నారు. నమోదు సమయంలో ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు.
ప్రత్యేక శిబిరాలతో అవగాహన
పథకం ప్రయోజనాలు, నమోదు విధానంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పారదర్శకంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఓ నర్సింహులు, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


