21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

పాలమూరు: చెక్‌బౌన్స్‌ కేసుల త్వరిత పరిష్కారం కోసం ఈనెల 21న జిల్లాలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్‌ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసులకు త్వరిత పరిష్కారం లభిస్తుందని, సంబంధిత కేసుల కక్షిదారులు ప్రత్యేక లోక్‌ అదాలత్‌కు హాజరుకావాలని సూచించారు.

మైనింగ్‌ ఏడీగా రవీందర్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ కార్యదర్శిగా రవీందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి.. మొక్కను అందజేశారు. అదిలాబాద్‌లో పనిచేస్తున్న ఆయనను డిప్యూటేషన్‌పై జిల్లా మైనింగ్‌ ఏడీగా (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగిస్తూ ఆ శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన జిల్లాలో గనులు, భూగర్భ శాఖ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, శాఖాపరమైన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు.

రేపు షూటింగ్‌బాల్‌

ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రం క్రిస్టియన్‌పల్లిపల్లిలోని హీరా మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా షూటింగ్‌బాల్‌ బాల, బాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్‌బాల్‌ ప్రతినిధి గులాం అఫ్రోజ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు నల్లగొండ పట్టణం చర్లపల్లిలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ టోర్నీలో పాల్గొంటారని చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 98857 04173, 99494 91518లను సంప్రదించాలని ఆయన కోరారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర రూ.3,996

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సోమవారం ధాన్యం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 17,791 బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,996, కనిష్టంగా రూ.2,509 ధరలు లభించాయి. త్వరలోనే ధాన్యం ధరలు రూ.4 వేలు దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 1075 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,193, కనిష్టంగా రూ.2,936, వేరుశనగ 648 బస్తాలు రాగా క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,071, కనిష్టంగా రూ.6,169 ధరలు లభించాయి.

● నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం ఎర్ర కందులు క్వింటాకు గరిష్టంగా రూ.11,221, కనిష్టంగా రూ. 11,219 ధర పలికింది. హంస ధాన్యం (1010) గరిష్టంగా రూ. 2,451, కనిష్టంగా రూ. 2,363, కేఎన్‌ఎం వడ్లు గరిష్టంగా రూ. 3,630, కనిష్టంగా రూ. 2,870, సోన ధాన్యం గరిష్టంగా రూ. 3,966, కనిష్టంగా రూ. 2,523 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement