ఈ నెల 19న పథకం ప్రారంభం
అమలు ఇలా..
● 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
● మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
● కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల
ఆర్థిక సాయం
● జిల్లాలో 2 లక్షలకు
పైగా కుటుంబాలకు ప్రయోజనం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న సిద్ధిపేట వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. సర్కారు నిర్ణయంతో జిల్లాలో 2 లక్షలకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
రూ.5 లక్షల బీమా..
పేద, మధ్యతరగతి వర్గాల్లో ఇంటి పెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు నిర్ణయించింది. ఈ పథకం కింద సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వనుంది. పథకం అమలుపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇంటింటికీ ఇందిరమ్మ బీమా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18– 59 ఏళ్లలోపు ఉండాలి. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా వయసును నిర్ధారిస్తారు. జనాభా గణనలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలు చేయనున్నారు. పథకం తీరు తెన్నులను ప్రజలకు తెలియజేసేలా 17, 18 తేదీల్లో జిల్లాలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో టాంటాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇందిరమ్మ బీమా పథకం కోసం ఈ నెల 20 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయనున్నారు. ఇందుకోసం నిర్దిష్ట ప్రొఫార్మా సిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు చేరవేసింది. వీటి ద్వారానే ప్రజలు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బీమా క్లెయింలకు సంబంధించి గ్రామస్థాయిలో అయితే పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ, సీపీఓ/డీఆర్‌డీఓ, కలెక్టర్/ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆమోదం ద్వారా బీమా కంపెనీకి ఫార్వర్డ్ చేస్తారు. మున్సిపల్ స్థాయిలో వార్డు ఆఫీసర్ దరఖాస్తులను స్వీకరించనుండగా.. కమిషనర్ పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌తోపాటు సీపీఓ/ మెప్మా పీడీ పరిశీలించి కలెక్టర్/ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత క్లెయిం ఫాం బీమా కంపెనీకి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువగా సంపాదించేవారు ఉంటే ఎవరి పేరిట బీమా పొందాలనుకుంటున్నారో, వారి నామినీలను నిర్ణయించుకునే వెసులుబాటు దరఖాస్తుదారులకు కల్పించింది.


