కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిల్ల సమీపంలో చేపడుతున్న పాలమూరు ప్రాజెక్టు పనులను కుడికిల్ల, బోడబండతండాకు చెందిన నిర్వాసిత రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. ప్రాజెక్టు ప్యాకేజీ–3లో భాగంగా చేపడుతున్న ప్రధాన కాల్వ, బ్రిడ్జి నిర్మాణ పనులను ఉదయం నుంచి నిలిపివేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాము భూములతో పాటు నివాస గృహాలను సైతం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు. అదేవిధంగా కుడికిల్ల రైతులకు భూములపై అదనపు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు కారణంగా సర్వస్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందించే వరకు ప్రాజెక్టు పనులను కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రాజెక్టు ఈఈ అమర్‌సింగ్‌ను వివరణ కోరగా.. బోడబండ తండా నిర్వాసిత రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద, కుడికిల్ల రైతులకు భూముల అదనపు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.


