జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటూ గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అదనపు డీఆర్‌డీఓ రేణుక సూచించారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్యలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులకు మార్కెటింగ్‌పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎంపికై న మహి ళా పారిశ్రామికవేత్తలకు తమ వ్యాపారాలను వేగంగా అభివృద్ధి చేసుకోవడంతోపాటు ఆదా యం పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సదస్సులో కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించడంతోపాటు ఆసక్తి ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డీపీఎం రామమూర్తి, వీ–హబ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు అబిద్, మునీష్, శ్రీకర్, ఏపీఎంలు రమేశ్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.


