● కలెక్టర్ ఖుష్బూగుప్తా
జడ్చర్ల: ఎల్‌నినో ప్రభావం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. బుధవారం జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లిలో రైతు రాజవర్ధన్‌రెడ్డి తన 34ఎకరాలలో ఏర్పాటు చేసిన గోఆధారిత సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సౌరశక్తితో పనిచేసే సోలార్ పాలీ టన్నెల్‌ను ప్రారంభించారు. అనంతరం గోఆధారిత సేంద్రియ వ్యవసాయ విధానాలను, వివిధ పంటల సాగు వివరాలను, పశు పోషణ, మునగతోపాటు ఇతర ఉద్యాన పంటల సాగును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మునగ ఆకు పొడి తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన ఎరువుల వినియోగం, తక్కువ నీటి వనరులతో చేపట్టిన పంటల సాగు విధానాలను సంబంధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతుల నుద్దేశించి మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయడం అభినందనీయమన్నారు. ఏ మొక్కను ఎక్కడ నాటాలి, వాటి మధ్య అంతర పంటలుగా ఏఏ పంటలను సాగుచేయాలి, తద్వారా నేల సారం, పర్యావరణ సమత్యులతతోపాటు రైతులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందనే అంశాలను శాసీ్త్రయ అవగాహనతో అమలు చేయడం స్ఫూర్తి దాయకమన్నారు. ఇలాంటి సమీకృత వ్యవసాయ క్షేత్రాలను రైతులు సందర్శించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఏఓ గోవింద్‌నాయక్, జిల్లా ఉద్యానవశాఖ అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


