ఇక ఆరుబయట ఉండకూడదు
మక్తల్: వ్యవసాయానికి నిరంతరం త్రీఫేస్ కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని సంగంబండ, చందాపూర్, మాద్వార్ గ్రామాల రైతు లు మక్తల్ సబ్‌స్టేషన్ ఎదుట 167 హైవేపై రైతులు రాస్తారోకో చేశారు. దాదాపు 2 గంటల వరకు నిరసన కొనసాగడంతో ట్రాఫిక్‌జాం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్‌కో ఏడీ వచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. దీంతో మక్తల్ ఎస్‌ఐ రేవతి, మాగనూర్ ఎస్‌ఐ అశోక్‌బాబు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎండిపోయిన పంటలకు, కౌలు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. లోఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు అందించడంతో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అనంతరం విద్యుత్ ఏడీ విజయ్‌భాస్కర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
చెట్టు నీడన.. అనంతమ్మ దీనగాథ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆ వయసులో ఓ ఇంటి గడప.. నాలుగు గోడ ల మధ్య భద్రత.. ఆప్యాయంగా పలకరించే మనుషులు తోడుగా ఉండాలి. కానీ బండమీదిపల్లికి చెందిన 63 ఏళ్ల కురువ అనంతమ్మకు మాత్రం చెట్టు నీడే ఆవాసంగా మారింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె ఆరుబయటే జీవనం సాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ బండమీదిపల్లికి వెళ్లి అనంతమ్మ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, కుటుంబసభ్యులు, భూమి, ఆస్తులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలికి ప్రస్తుతం ఎవరు అండగా ఉన్నారు? అనారోగ్య సమయంలో వైద్యం ఎలా అందుతోంది? రోజువారీ అవసరాలు ఎలా తీరుతున్నాయి? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అనంతమ్మను కుటుంబసభ్యులు బాధ్యతగా చూసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆమెకు ఆహారం, వైద్యం, భద్రత, రోజువారీ సంరక్షణలో ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యుల నుంచి నోటరీ చేయించిన హామీ పత్రం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతమ్మ ఇకపై చెట్టు కింద, ఆరుబయట జీవించాల్సిన పరిస్థితి రాకుండా సురక్షితమైన ఆశ్రయం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి లేదా సమీప ఆరోగ్య కేంద్రం ద్వారా నిరంతర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతమ్మకు వృద్ధాప్య పింఛన్, రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. అర్హత ఉంటే అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. వృద్ధాప్యంలో కుటుంబం అండగా నిలవాల్సిన సమయంలో.. చెట్టు నీడన జీవించాల్సిన పరిస్థితి అనంతమ్మకు ఎదురైంది. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఆమె పరిస్థితిపై అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఇకపై ఆమెకు సురక్షిత జీవనం, వైద్యం, సంక్షేమ సహాయం అందేలా చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.


