నర్వ: కుటుంబ కలహాల తో వివాహిత ఆత్మహత్య కు పాల్పడిన ఘటన నర్వ మండలం జంగంరెడ్డిపల్లి లో చోటు చేసుకుంది. ఎస్ ఐ పబ్బతి రమేశ్ వివరాల మేరకు.. జంగంరెడ్డిపల్లికి చెందిన అనూష (28)కు అదే గ్రామానికి చెంది న గడ్డం అశోక్‌తో 2019లో వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాలు నెలకొన్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు నచ్చజెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఇరువు రి మధ్య విబేధాలతో భర్త అశోక్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మక్తల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యతో గొడవపడి
గొంతు కోసుకున్న భర్త
అమరచింత: మద్యానికి బానిసై తాగేందుకు చేతి లో డబ్బులు లేక భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బీసీ కాలనీలో చాకలి లక్ష్మణ్, భాగ్యమ్మ దపంతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇళ్లలో పాచీ పనులు చేస్తూ భాగ్యమ్మ కుటుంబాన్ని పోషిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భాగ్యమ్మ భర్త లక్ష్మణ్‌కు కాలు విరిగింది. అప్పటి నుంచి పనిచేయడానికి సత్తువ లేదంటూ భార్య సంపాదన మీదే ఆధారపడ్డాడు. దీనికి తోడు సారా తాగేందుకు అలవాటుపడ్డాడు. ఈ వ్యవహరంలో 5 నెలల కిందట భార్యభర్తల మధ్య గొడవ జరగగా.. లక్ష్మణ్ బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. రక్తస్రావంతో ఉన్న లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తీసుకుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే తరహలో మరోమారు గురువారం లక్ష్మణ్ గొంతు కోసుకోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్ బోల్తా..
యువకుడి దుర్మరణం
● ముగ్గురి పరిస్థితి విషమం
కోస్గి రూరల్: ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుండుమాల్ మండల కేంద్రంలోని కేఈసీ కంపెనీలో తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లాకు చెందిన శరత్‌కుమార్ (27) నందకుమార్, జయశంకర్, అన్బులు నలుగురు కూలీలుగా పనిచేసేవారు. గురువారం ట్రాలీ ట్రాక్టర్‌లో ఇనుప కడ్డీల లోడ్ వేసుకొని వికారాబాద్ జిల్లాలోని లింగంపల్లికి బయలుదేరారు. నాచారం గ్రామ శివారుకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇనుప కడ్డీలు శరత్‌కుమార్‌పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నందకుమార్, జయశంకర్, అన్బులకు తీవ్రగాయాలు కాగా 108లో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురిని ప్రైవేటు వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


