నిబంధనలు పాటించకుండా ఇళ్లు కూల్చడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించకుండా ఇళ్లు కూల్చడం సరికాదు

Oct 2 2026 12:52 AM | Updated on Oct 2 2026 12:52 AM

మెడికల్‌ సెంటర్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత

జడ్చర్ల టౌన్‌: నిబంధనలు పాటించకుండా మహిళను భయబ్రాంతులకు గురిచేసి ఇళ్లు కూల్చడం సరికాదని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం స్థానిక కావేరమ్మపేటలోని ఎంబీ మెడికల్‌ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డా.అనురాధ మార్గరేట్‌తో మాట్లాడారు. మూడు రోజుల క్రితం తాను ఇంట్లో ఉండగా కత్తులు, తుపాకులతో బెదిరించి ఇంట్లోంచి లాగి బయట చెట్టుకింద కూర్చోబెట్టి బుల్డోజర్‌లతో ఇళ్లు కూల్చివేశారని బాధితురాలు ఎంపీ ముందు వాపోయారు. పోలీసులకు ఫోన్‌ చేసినా ఎవరు స్పందించలేదని, ఆ సమయంలో మీకు ఫోన్‌ చేసిన తర్వాతే మూడు గంటలు గడిచాక పోలీసులు వచ్చారని కన్నీరు పెట్టుకుంది. అనంతరం అక్కడే ఉన్న బ్యాంక్‌ యాక్షన్‌లో కొన్న వారితోనూ డీకే అరుణ మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా చేయటం సరికాదన్నారు. తుది తీర్పు వచ్చే వరకు సంయమనం పాటించాలని కొనుగోలుదారు ప్రతినిధి నరేందర్‌రెడ్డికి సూచించారు. కొన్న వారు మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించి వారి ద్వారా పొజిషన్‌లో ఉన్న వారికి నోటీసులు ఇవ్వాలని, అపుడు స్పందించకుంటే కలెక్టర్‌ ద్వారా సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. అలా కాకుండా ఇలా దౌర్జన్యంగా కూల్చివేయటం నిబంధనలు పూర్తిగా పాటించకపోవటమేనన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కలెక్టర్‌ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మెడికల్‌ సెంటర్‌కు వచ్చిన క్రైస్తవులతోనూ మాట్లాడారు. ఓర్పు వహించాలని, కోర్టు తుది తీర్పు వెలువడే వరకు సంయమనం పాటించాలన్నారు.

ఎంపీ డీకే అరుణ

ఎంబీ మెడికల్‌ సెంటర్‌ వద్ద గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. సెంటర్‌ ప్రాంగణంలో కంటైనర్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న కై స్తవులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతను అడ్డుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఏఎస్‌ఐ రమేష్‌ జారి గుంతలో పడిపోయారు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవటంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement