బిడ్డను విక్రయించిన డబ్బు కోసమే చంపాడా? | - | Sakshi
Sakshi News home page

బిడ్డను విక్రయించిన డబ్బు కోసమే చంపాడా?

Oct 3 2026 12:56 AM | Updated on Oct 3 2026 12:56 AM

మక్తల్‌: కట్టుకున్న భార్యను భర్తే బండరాయితో మోపి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న లక్ష్మణ్‌ చెబుతున్న వివరాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు.. 20 రోజుల క్రితం యశోదకు మగబిడ్డ పుట్టడం, ఆ తర్వాత బిడ్డకు సంబంధించిన సమాచారం స్పష్టంగా లేకపోవడం కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మక్తల్‌ మండలం గుడిగండ్లకు చెందిన యశోద(40)కు సుమారు 20 రోజుల క్రితం మరికల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించినట్లు సమాచారం. బిడ్డను దంపతులిద్దరూ ఎవరికై నా విక్రయించారా? లేక మరేదైనా కారణంతో బిడ్డకు సంబంధించిన వివరాలను దాచారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బిడ్డకు సంతానం లేని వారికి విక్రయించారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. బిడ్డ పుట్టిన అనంతరం యశోద వద్ద ఉన్న డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆటోలో ఇద్దరూ కలిసి జక్లేర్‌–బొందల్‌కుంట గ్రామాల స్టేజీల మధ్యకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ యశోదపై లక్ష్మణ్‌ దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

పొంతన లేని సమాధానాలు

లక్ష్మణ్‌ ధన్వాడ మండలం మంత్రోన్‌పల్లికి చెందిన హన్మంతు వద్ద ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. యశోద హత్యకు సంబంధించి లక్ష్మణ్‌ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నవజాత శిశువు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. బిడ్డను ఎవరికై నా అప్పగించారా.. విక్రయించారా.. లేక మరో ఘటన జరిగిందా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. కాగా..యశోదను భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ ఆమె అన్న కాశీనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సమీప బంధువులు లేకపోవడంతో యశోద అంత్యక్రియలను మక్తల్‌ శ్మశానవాటికలో నిర్వహించారు.

20 రోజుల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చిన యశోద

భార్యను బండరాయితో మోపి చంపిన భర్త

బిడ్డ విక్రయంపై అనుమానాలు?

ఆ డబ్బుల విషయంలో

దంపతుల మధ్య గొడవ?

యశోద మృతిపై వీడని మిస్టరీ..భర్తను వివిధ కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement