విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Oct 3 2026 12:56 AM | Updated on Oct 3 2026 12:56 AM

మల్దకల్‌: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని మద్దెలబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ వీరన్న(45) తన వ్యవసాయ పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా.. బోరు మోటారుకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో తెగిన విద్యుత్‌ తీగలను సరిచేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.

సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌కు గాయాలు

కేటీదొడ్డి: మండలంలోని గంగన్‌పల్లి 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకునే క్రమంలో లైన్‌మెన్‌ విద్యుత్‌ఘాతానికి గురైన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గంగన్‌పల్లి సబ్‌స్టేషన్‌లో ఆర్టీజీఎన్‌ గ్రేడ్‌–2 ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నజీర్‌ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌పార్మర్‌ వద్ద ఎల్‌సీ తీసుకునే క్రమంలో ఐసోలేటర్లను ఓపెన్‌ చేస్తుండగా ఆకస్మాత్తుగా ఎర్త్‌ అయి విద్యుత్‌ ప్రసరించింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆయనకు కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బావిలో బాలుడి మృతదేహం లభ్యం

ధన్వాడ: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న మెట్ల బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దేవరకద్ర మండలం గోపన్‌పల్లి చెందిన కృష్ణ (14) తల్లిదండ్రులతో కలిసి చౌదర్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం ధన్వాడలో ఉంటున్న అక్కను చూసేందుకు వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. కానీ కృష్ణ అక్క ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో శుక్రవారం మెట్ల బావిలో కృష్ణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.. లేక ఆత్మహత్య చేసుకునేందుకు బావిలోకి దూకాడా అనే విషయాలు తెలియాల్సి ఉందని ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ మహేశ్వరి తెలిపారు.

కడుపునొప్పి భరించలేక కూలీ ఆత్మహత్య

బల్మూర్‌: అనారోగ్యంతో బాధపడుతూ దినసరి కూలీ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మైలారంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పోతుల చంద్రయ్య (37), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న చంద్రయ్య ఐదేళ్లుగా అల్సరు, కడుపునొప్పితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్న మృతుడు రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడిని తీసుకొని గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కడుపునొప్పి భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడటంతో గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్‌ క్రైం: రైలు పట్టాలు దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డాకుల మండలం గుడిబండకు చెందిన ఆంజనేయులు శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫామ్‌ సమీపంలో పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆంజనేయులు కుడిచేయి తెగిపోవడంతో పాటు కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ భాషా, పైలెట్‌ అంజిలయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement