అలంపూర్: అలంపూర్ క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీహోమాలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం చేశారు. భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో దర్శనానికి రెండు గంటల వరకు వేచి చూడాల్సిన వచ్చిందని పలువురు తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు సంబంధించిన వాహనాలు అధికంగా రావడంతో పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులకు స్థానిక ప్రసాద్ స్కీం భవనంలో అన్నప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పంచలోహ విగ్రహం అందజేత
అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు హైదరాబాద్‌కు చెందిన జైనీ రామ్మోహన్, దుర్గ దంపతులు శుక్రవారం పంచలోహా విగ్రహం అందజేసినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. 100 కేజీల బరువు గల పంచలోహ విగ్రహం విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం నిత్య పూజలు జరుగుతాయన్నారు.


