పాలమూరు: ఇరు వర్గాల మధ్య ఉండే వివాదాలను వేగంగా సులభంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో మధ్యవర్తిత్వ చట్టం–2023 ప్రకారం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు జరిగే జాతీయ 3.0(ఓ) ప్రత్యేక మధ్యవర్తిత్వ (స్పెషల్)డ్రైవ్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. జిల్లా కోర్టులో గురువారం ఆమె మాట్లాడుతూ మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల కోర్టులలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక న్యాయవాద బృందాలను మధ్యవర్తిత్వం ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మధ్య వర్తిత్వం ద్వారా ఇరుపక్షాల వారు తమ ఇష్టపూర్వకంగానే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ ప్రత్యేక 3.0 కార్యక్రమం ద్వారా ప్రత్యేక న్యాయవాదులు ఇరు వర్గాలకు అనుకూలమైన తీరులో వివాదాలను పరిష్కారించడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను కక్షిదారులు ఉపయోగించుకోవడం వల్ల వారి వివాదాలు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు.
5న ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల బోనఫైడ్‌తో ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. మిగతా వివరాల కోసం 93964 39663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
జూరాల ఆయకట్టుకు వారాబందీ పద్ధతిలో సాగునీరు
గద్వాల: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణానదిలో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని జూరాల కింద సాగుచేసిన ఆయకట్టుకు వారాబందీ విధానంలో సాగునీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల డ్యాం డీఈ నాగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు కాల్వకు నీటి విడుదల నిలిపివేశామని, తిరిగి ఈ నెల 7న కాల్వకు నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెంపు
గద్వాల: గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూములకు సాగునీరు అంది సస్యశ్యామలంగా మారుతాయని, తద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గద్వాల ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బీటెక్ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీటెక్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈమేరకు బీటెక్ రెండో సెమిస్టర్‌లో 68.68 శాతం, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఏడో సెమిస్టర్‌లో 52.17శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడీషనల్ కంట్రోలర్ అనురాధా, రవీందర్‌రెడ్డి, తేజవర్దన్ తదితరులు పాల్గొన్నారు.


