నారాయణపేట: వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షాభావ పరిస్థితులు వీడటం లేదు. వానాకాలం ముగియడానికి వారం రోజులే ఉండటంతో.. రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు నమోదైన వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 35 శాతం, జోగుళాంబ గద్వాలలో 42 శాతం, మహబూబ్‌నగర్‌లో 29 శాతం, నాగర్‌కర్నూల్‌లో 32 శాతం లోటు నమోదైంది.
నారాయణపేట జిల్లాను పరిశీలిస్తే..
నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు జిల్లా సగటు సాధారణ వర్షపాతం 469.5 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 306.6 మి.మీ. మాత్రమే నమోదైంది. మద్దూర్, కోస్గి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదైన మండలం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మండలాల వారీగా పరిశీలిస్తే నర్వలో అత్యధికంగా 47 శాతం, ఊట్కూర్, మాగనూర్, మక్తల్‌లో 42 శాతం చొప్పున లోటు ఉంది. మరికల్‌లో 42, ధన్వాడలో 41, నారాయణపేటలో 38, దామరగిద్దలో 37, కృష్ణాలో 35, గుండుమాల్‌లో 29, కొత్తపల్లిలో 31 శాతం లోటు నమోదైంది. మద్దూర్ మండలంలో సాధారణ వర్షపాతం 421.2 మి.మీ.గాను 377.7 మి.మీ. నమోదై 10 శాతం లోటుతో సాధారణ స్థితిలో ఉంది. కోస్గిలో సాధారణ వర్షపాతం 519.2 మి.మీ.కుగాను 452.7 మి.మీ. నమోదై 13 శాతం లోటుతోనూ సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉంది. వర్షాకాలం ముగింపు దశకు చేరుతున్నా జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు కొనసాగుతుండటంతో వర్షాధార పంటలపై ఆందోళన నెలకొంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో 11 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో తీవ్ర లోటు నమోదుకాగా.. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 487.7 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 345.5 మి.మీ. మాత్రమే నమోదైంది. బుధవారం జిల్లాలో 3.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలంలో అత్యంత దారుణ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 433.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 171.1 మి.మీ. మాత్రమే కురిసింది. 61 శాతం లోటు నమోదై ‘లార్జ్ డెఫిషియెంట్’గా నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్‌లో 52 శాతం, అడ్డాకులలో 51 శాతం, మహబూబ్‌నగర్ అర్బనన్‌లో 49 శాతం, కౌకుంట్ల, ముసాపేటలో 43 శాతం, భూత్పూర్‌లో40 శాతం, కోయిల్‌కొండలో 37 శాతం లోటు నమోదైంది. గండీడ్, నవాబ్‌పేట, బాలానగర్, జడ్చర్ల, మహ్మదాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గండీడ్, నవాబ్‌పేటలో సాధారణానికి 2 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
తుదిదశకు చేరుకున్న వానాకాలం
ఉమ్మడి జిల్లాను వీడని వర్షాభావం
చెరువులు వెలవెల.. భూగర్భ జలం తగ్గుముఖం
వాడుముఖం పట్టిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు


