రైలు పరుగులు.. రహదారి విస్తరణ.. బ్రహ్మోస్ రాక
దేవరకద్ర రూరల్: నిన్నటి దేవరకద్రకు.. రేపటి దేవరకద్రకు మధ్య భారీ మార్పు కనిపించనుంది. రైల్వే డబ్లింగ్, భారత్‌మాల కింద నాలుగు లేన్ల రహదారి, ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ ప్రాజెక్ట్.. ఈ మూడు భారీ పనులతో ప్రాంత రూపురేఖలు మారుతున్నాయి. ఇందుకోసం వందల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు కోట్ల రూపాయల పరిహారం అందుతోంది. రవాణా, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్టులు దేవరకద్రను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుండగా.. భూములే ఆధారంగా జీవిస్తున్న రైతులపై మాత్రం కొత్త పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి.
ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ ప్రాజెక్ట్ కోసం 416.09 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో 63 ఎకరాలు ప్రభుత్వ భూమి, 20.29 ఎకరాలు అసైన్డ్ భూమి కాగా.. మిగతా పట్టా భూమిని రైతుల నుంచి సేకరిస్తున్నారు. చౌదర్‌పల్లిలో 17.18, బస్వాయపల్లిలో 126.09, జీన్గురాలలో 187.37 ఎకరాల పట్టా భూమి సేకరణలో ఉంది. మూడు గ్రామాల్లో కలిపి 332 ఎకరాలను 148 మంది రైతుల నుంచి తీసుకోనున్నారు. పరిహారం అంశంపై ఇటీవల కలెక్టరేట్‌లో రైతులతో అధికారులు చర్చించారు. ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది.
బ్రహ్మోస్ కోసం సర్వే జరుపుతున్న అధికారులు
మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో దేవరకద్ర రూపు రేఖలు
వేగంగా సాగుతున్న రైల్వే డబ్లింగ్, భారత్‌మాల నాలుగు లైన్ల రోడ్డు పనులు
వందల ఎకరాల భూసేకరణ.. రూ.కోట్లలో పరిహారం
రవాణా, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు


