గ్రామ ప్రగతికి పక్కా ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

గ్రామ ప్రగతికి పక్కా ప్రణాళిక

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామాల సమగ్ర అభివృద్ధికి వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తొమ్మిది మండలాల సర్పంచులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రణాళికల రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు. అక్టోబర్‌ 1 నుంచి 2027 జూన్‌ వరకు ఉపాధి కల్పనతోపాటు గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులను గుర్తించి ప్రణాళికల్లో చేర్చాలన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్లు, పర్కొలేషన్‌ ట్యాంకులు, రీచార్జ్‌ బోర్‌వెల్లు, సోక్‌పిట్లు వంటి నీటి సంరక్షణ పనులను చేపట్టాలన్నారు. మౌలిక వసతులు, జీవనోపాధి, నీటి సంరక్షణ, వర్షాభావ నివారణకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. పాఠశాలలు, అంగన్‌వాడీ, పంచాయతీ, వీఓ భవనాలు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల అవసరాలను గుర్తించి ప్రణాళికల్లో పొందుపరచాలన్నారు. ఈ నెల 30లోగా గ్రామాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. అక్టోబర్‌ 2న జరిగే గ్రామసభల్లో అభివృద్ధి అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వేణుగోపాల్‌, గోవింద నాయక్‌, జయాబాయి, శివానంద స్వామి, జెడ్పీ సీసీఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య సేవల్లో

ఫార్మాసిస్ట్‌ల పాత్ర కీలకం

పాలమూరు: ఆస్పత్రులు, ఆరోగ్య వ్యవస్థలో ఫార్మాసిస్ట్‌ల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ ఫార్మాసిస్ట్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాత డీఎంహెచ్‌టో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య సేవలు సజావుగా కొనసాగడంలో ఫార్మాసిస్ట్‌లు ప్రముఖంగా ఉంటారని తెలిపారు. రాబోయో రోజుల్లో కూడా ఫార్మాసిస్ట్‌లు బాధ్యతతో రోగులకు సేవలు అందించాలన్నారు. ఆ తర్వాత కేకు కట్‌ చేసి వేడుకలు జరుపుకోవడంతో పాటు ఫార్మాసిస్ట్‌లను సత్కరించారు. సీహెచ్‌ఐ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ శివకాంత్‌, పీహెచ్‌సీల ఫార్మాసిస్ట్‌లు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాల ల్యాబ్‌ తనిఖీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల డ్రాయింగ్‌ ల్యాబ్‌ను వీసీ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. డ్రాయింగ్‌ చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారి ప్రాక్టికల్‌ నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ విద్యలో డ్రాయింగ్‌ నైపుణ్యాలు కీలకమని, ల్యాబ్‌లోని పరికరాలను సద్వినియోగం చేసుకుని సబ్జెక్టుపై పట్టు సాధించాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.

తుది జాబితా ప్రకటించని కార్మిక శాఖ అధికారులు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ఈనెల 21న ఆరంభమైంది. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోలలో పనిచేసే సిబ్బంది పూర్తి వివరాలను అదే రోజు జిల్లా కార్మికశాఖ అధికారులకు డీఎంలు పంపించారు. అయితే 22న ప్రాథమిక ఓటర్ల జాబితాను గాని, 25న తుది జాబితాను గాని డిపోల వారీగా ఆ శాఖ ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికల్లో ఎంత మంది ఓటర్లు అర్హత కలిగి ఉన్నారనేది ఇంకా స్పష్టం కాలేదు.

పనిచేసే చోటే ఓటు హక్కు కల్పించాలి

గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా ఏ డిపో పరిధిలో పనిచేసే సిబ్బందికి అక్కడే వచ్చే నెల 9న ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని టీజీఎస్‌ ఆర్టీసీ టీడబ్ల్యూయూ రీజియన్‌ కార్యదర్శి ఎం.మధుసూదన్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివిధ డిపో లలో ఇటీవల భారీగా బదిలీలు జరిగాయని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement