జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరూ స్వబుద్ధితో ఆలోచించాలని, బుద్ధి పక్కదారి పడితే దానిని ఆలోచన అనే అంకుశంతో అణిచివేయాలని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచించారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని గౌరీశంకర్ కాలనీలోని వినాయక మండపం వద్ద శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆధునిక జీవితంలో భగవద్గీత ప్రాధాన్యంపై ఆయన ప్రవచించారు. మాటల్ని బట్టి మనిషిని గౌరవించటం అలవర్చుకోవాలని, మనిషిని బట్టి మాటల్ని విశ్వసించరాదన్నారు. మనందరి అంతిమ లక్ష్యం మరో జన్మ ఉండకూడదని, జన్మరాహిత్యం కోసం ప్రయత్నించాలన్నారు. మానవ జన్మ ఎంతో అదృష్టమని, అందుకే ఇలా వినాయక వ్రతం, పూజ చేసుకోగలుగుతున్నామని, ప్రవచనాలు వినగలుగుతున్నామన్నారు. అందుకే ఏది ధర్మమో అది చేయాలన్నారు. మనపనిమనం చేయాలని, లాభనష్టాలు ఆశించకూడదన్నారు. లాభం మాత్రం ఆశిస్తామని నష్టం భరించలేమంటే ఎలా అన్నారు. అలాగే సుఖం కోరుకుంటామని, దుంఖః భరించనంటే ఎలా అని ఆలోచించాలన్నారు. లాభం రావాలంటే కొంత నష్టం తప్పదని, సుఖం దక్కాలంటే కొంత దుంఖం తప్పదన్నారు. మనవాడు దుర్మార్గుడైన సమర్దిస్తామని, మిగిలిన వారిని ద్వేషిస్తామని, అలాకాకుండా మంచి చెడులు ఆలోచించి దుర్మార్గుడైన మనవాడిని సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. అంతకుముందు ఆయనకు శ్రీనాథ్ ఆధ్వర్యంలోని భక్తబృందం ఘన స్వాగతం పలికారు.


