● స్వల్ప గాయాలతో బయటపడిన మహిళ
● భూత్పూర్ బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు
● 10 రోజుల్లో రెండో ప్రమాదం..
ఆందోళనలో వాహనదారులు
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. వాహనాలు అతివేగంగా నడపడం, ముందుగా వెళ్తున్న వాహనాలను గుర్తించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు బ్రిడ్జిపై వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోంది. తాజాగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
ఆగిన డీసీఎం.. వెనుక నుంచి మరో వాహనం ఢీ
ఎస్‌ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్‌గౌడ్ (26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్‌గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు.
పది రోజుల క్రితమే ఇద్దరి మృతి
గత నెల 27న ఇదే బ్రిడ్జిపై మరమ్మతుల కోసం లారీని నిలిపి ఉంచినా ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో బైక్‌పై వెళ్తున్న కావేరమ్మపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీని ఢీకొని మృతిచెందారు. తాజాగా మరో ప్రమాదం జరగడంతో బ్రిడ్జిపై భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పది రోజుల వ్యవధిలో ఇదే బ్రిడ్జిపై ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.


