నిందితుల వివరాలు
వనపర్తి: జల్సాల కోసం చోరీ వృత్తిగా మార్చుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా బైకులు చోరీ చే స్తూ వాటిని రాష్ట్రం దాటించి విక్రయిస్తున్న అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారినుంచి చోరీకి సంబంధించిన రూ.12.50లక్షల విలువైన 15మోటర్ సైకిళ్లను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం పెబ్బేరు పీఎస్‌లో ఎస్పీ సునితారెడ్డి మీడియాకు వెల్లడించారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల ప్రాంతానికి చెందిన కుర్వ శ్రీరాములు తన బైక్ చోరీకి గురైనట్లు ఇటీవల పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్ ఐ వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రంగాపూర్ శివారులోని గుర్రంగడ్డ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీసులను గమనించిన నిందితుడు అమీర్ హంజా పఠాన్ బైక్‌ను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లోతుగా విచారించారు. దీంతో తన సోదరుడు పఠాన్ నబీ ఖాతో కలిసి బైకులు చోరీ చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించాడు. నిందితులు ప్రధానంగా పాతబైకులు, తాళం సెట్‌లు పాడైపోయిన వాహనాలు, సైడ్ లాక్ వేయకుండా పార్కింగ్ చేసిన బైకులు, తాళాలు పెట్టి నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను టార్గెట్ చేసేవారు. రెండు నెలల్లో తెలంగాణలో 8, ఏపీలో 10, మొత్తం 18బైకులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన బైకులను నంద్యాల జిల్లా ఆత్మకూరుకు తరలించి విక్రయించేందుకు లింగాపురం గ్రామానికి చెందిన రమేష్, వెంకటరమణతో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. బైకులను తాము చోరీచేసి తీసుకొస్తామని, వాటిని విక్రయిస్తే ఒక్కో బైక్‌కు కమీషన్ ఇస్తామని నిందితులు వారితో డీల్ కుదుర్చుకున్నట్లు చోరీలకు పాల్పడుతున్నారని మా విచారణలో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. పెబ్బేరు, కొత్తకోట, గద్వాల, మానోపాడు, శాంతినగర్‌తోపా టు ఏపీలోని కర్నూల్, దోర్నాల, పాణ్యం, ఎరగ్రొండపాలెం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బైకులను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీ చేసిన 18బైకుల మొత్తం విలువ సుమారు రూ. 12.50 లక్షలు ఉంటుందని, నిందితుల నేర చరిత్ర పై ఎస్పీ వెల్లడి ప్రధాన నిందితుడు అమీర్ హంజా పఠాన్‌పై గతంలో ఒక కేసు ఉండగా, అతని సోదరు డు పఠాన్ నబీఖానపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దొంగతనం, పీడీ యాక్ట్ తదితర తీవ్రమైనవి కలిపి 14 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. నబీఖాన్ ఇప్పటికే 13సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
ఏ1 అమీర్ అమ్జా పఠాన్ అలియాస్ అమీర్ ఖాన్, ఇందిరానగర్, ఆత్మకూరు పట్టణం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ2. పఠాన్ నబీ ఖాన్, గరీబ్‌నగర్, ఆత్మకూరు పట్టణం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ3. పాతకోట రమేష్, జి.లింగాపురం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, ఏపీ ఏ4.వల్లెపు వెంకటరమణ, లింగాపురం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, ఏపీగా చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసిన వనపర్తి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ రాంబాబు, పెబ్బేరు ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌ను అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రెడ్డి, కానిస్టేబుళ్లు నరసింహ, విజయ్, రైటర్ ఆంజనేయులును నగదు బహుమతితో అభినందించారు.
18 బైకుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
జల్సాల కోసం బైక్ చోరీలను వృత్తిగా మార్చుకున్న అన్నదమ్ములు
పాత బైకులు, తాళాలు సరిగాలేని వాహనాలే టార్గెట్
ఏపీ, తెలంగాణలో చోరీలు
హత్య, దొంగతనాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితుల నేర చరత్ర
రూ.12.50 లక్షల విలువైన 18 బైకుల చోరీల్లో రికవరీ


