మావోయిస్టుల మారణకాండకు 21ఏళ్లు! | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల మారణకాండకు 21ఏళ్లు!

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

‘నారాయణపేటలో పంద్రాగస్టు వేడుకల వేళ నెత్తుటి విషాదం

మావోల తూటాలకు ఎమ్మెల్యే

చిట్టెం నర్సిరెడ్డితోపాటు 10మంది దుర్మరణం

నారాయణపేట: పంద్రాగస్టు.. దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ.. నారాయణపేటలో మాత్రం తూటాల మోత మార్మోగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మావోయిస్టుల ఘాతుకానికి నేటితో 21ఏళ్లు. పంద్రాగస్టు వచ్చిందంటే చాలు.. 2005 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ రోజున నారాయణపేటలో చోటుచేసుకున్న ఆ రక్తపాత ఘటన జ్ఞాపకాలు స్థానికుల మదిలో మెదులుతాయి. ఈ ఘటనలో మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒక్క ఘటన.. 11కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

టెంకాయ కొడుతుండగా.. తూటాల మోత

2005 ఆగస్టు 15న నారాయణపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో సీసీరోడ్డు పనులకు శ్రీకారం చుట్టేందుకు టెంకాయ కొడుతుండగా మాటువేసిన మావోయిస్టులు మధ్యాహ్నం 1:25 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు తూటాలకు బలయ్యారు.

21ఏళ్లయినా.. జ్ఞాపకం చెరగలేదు

ఆ రోజు తూటాల మోత ఆగిపోయింది. ఘటనా స్థలం నిశ్శబ్దమైంది. కానీ మృతుల కుటుంబాల్లో మిగిలిన విషాదం మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది.ప్రతి పంద్రాగస్టు వేడుకా.. ఆ కుటుంబాలకు ఆనందంతోపాటు నాటి విషాదాన్ని గుర్తుచేస్తోంది.

తృటిలో ప్రాణాలు దక్కించుకున్నవారు

ఈ ఘటనలో అప్పటి ఆర్డీఓ శివారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సుదర్శన్‌రెడ్డి, ఘన్‌శ్యాందాస్‌ ధారక్‌, ఎమ్మెల్యే పీఏ భాస్కర్‌, అవుటి రాజశేఖర్‌, నాగేందర్‌, లోట్టి శ్రీనివాస్‌, సూరి తదితరులు గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.

విషాదం తర్వాత.. కుటుంబాలకు అండగా

బాధిత కుటుంబ సభ్యులకు వారి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి చిట్టెం లక్ష్మికి ఆర్డీఓగా అవకాశం లభించగా.. ఆమె అనంతరం ఐఏఎస్‌ హోదాకు ఎదిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement