మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రానికి చెందిన క్రికెటర్ ఎండీ అద్నానుద్దీన్ క్రికెట్‌లో విశేషంగా ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి ఎండీ రియాజుద్దీన్ సీనియర్ క్రికెటర్ కావడంతో చిన్నప్పటి నుంచే అద్నానుద్దీన్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. అనతికాలంలోనే ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌గా కుడిచేత లెగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. కెన్యాలోని నైరోబి కంట్రీ క్రికెట్ అసోసియేషన్ (ఎన్‌సీసీఏ) లీగ్ డివిజన్ వన్ క్రికెట్ పోటీల్లో అద్నానుద్దీన్ పాల్గొంటున్నాడు. ఓబోయో క్రికెట్ అకాడమీ ఏ–టీమ్ జట్టు తరఫున అద్నానుద్దీన్ లీగ్ పోటీల్లో ఆడనున్నాడు. ఈనెల 17వ తేదీన అద్నానుద్దీన్ కెన్యాకు బయలుదేరనున్నాడు. లీగ్ పోటీలు ఏడాది నవంబర్ మొదటి వారం వరకు జరగనుంది. ఈ లీగ్‌లో పాల్గొనే 12 జట్లతో క్రికెట్ ఆడే అవకాశం అద్నానుద్దీన్‌కు దక్కింది. అద్నానుద్దీన్ జాతీయ, రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభచాటాడు. పలుసార్లు హెచ్‌సీఏ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. 2024లో నేపాల్‌లో జరిగిన ఖేలో భారత్ యూత్ గేమ్స్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో పాల్గొన్నాడు. 2017–18లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, 2019–20లో మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్–19 ఎస్‌జీఎఫ్‌ఐ క్రికెట్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచుల్లో పాల్గొని ప్రతిభచాటాడు. హైదరాబాద్ వండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ జేఎస్‌ఎస్ సైన్స్, టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో అద్నానుద్దీన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాగా.. ఎన్‌సీసీఏ లీగ్ పోటీలకు వెళుతున్న ఎండీ అద్నానుద్దీన్‌ను శుక్రవారం డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి ఘనంగా సన్మానం చేశారు.


