ఆ ఊర్లో మద్యం బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఆ ఊర్లో మద్యం బంద్‌

Aug 12 2026 1:04 AM | Updated on Aug 12 2026 1:04 AM

ఇళ్లల్లో మళ్లీ సంతోషం రావాలి

బెల్ట్‌ షాపులకు శాశ్వతంగా తాళం

మార్పు యువతతోనే మొదలు

మత్తురహిత గ్రామమే లక్ష్యం

రాంచంద్రాపూర్‌ గ్రామసభలో తీర్మానం

12బెల్ట్‌ షాపులకు వారం రోజుల్లో తాళం

మద్యం అమ్మితే రూ.50వేల జరిమానా

సమాచారమిస్తే రూ.10 వేల నజరానా

మహిళలు, యువత ఐక్యంగా

మద్యపానంపై పోరు

కుటుంబాల ఆర్థిక పరిస్థితిని

కాపాడేందుకే నిర్ణయం

రామచంద్రాపూర్‌ గ్రామ వ్యూ

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఒక గ్రామం సంకల్పిస్తే సామాజిక మార్పు ఎంత వేగంగా సాధ్యమవుతుందో రామచంద్రాపూర్‌ నిరూపించింది. మద్యం కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోందని, యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతోందని గుర్తించిన గ్రామప్రజలు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చారు.గ్రామసభలో చారిత్రాత్మక తీర్మా నం చేసి ఇకపై గ్రామంలో బెల్ట్‌ షాపులకు చోటు లేదని తేల్చిచెప్పారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా విధించడంతోపాటు సమాచారం అందించిన వారికి రూ.10వేల నగదు బహుమతి ప్రకటించడం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం రామచంద్రాపూర్‌లో తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది.

సర్పంచ్‌ వై.నర్సింహులు అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, గ్రామపెద్దలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో కొనసాగుతున్న మద్యం విక్రయాలతో కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం, గృహహింస, ఆరోగ్య సమస్యలు, యువతలో వ్యసనాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ భవిష్యత్‌ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం గ్రామంలో సుమారు 12 బెల్ట్‌ షాపులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఆలయాల పరిసరాల్లోనే మద్యం విక్రయాలు సాగుతుండటంతో విద్యార్థులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామసభలో చర్చించారు. దీంతో వారం రోజుల్లో అన్ని బెల్ట్‌ షాపులను పూర్తిగా మూసివేయాలని తీర్మానించారు.

గ్రామంలో ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయించినా, నిల్వ ఉంచినా, బెల్ట్‌షాపు నిర్వహించినా రూ.50వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. సమాచారాన్ని అందించిన వారికి రూ.10వేల నగదు నజరానా ఇవ్వాలని కూడా గ్రామసభ ప్రకటించింది. గ్రామసభ తీర్మానాన్ని ఉల్లంఘించే వారిపై గ్రామస్తుల సమక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సుమారు 4వేల జనాభా ఉన్న రామచంద్రాపూర్‌లో అధికశాతం కుటుంబాలు వ్యవసాయ, దినసరి కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సంపాదించిన కూలీ మద్యం కోసం ఖర్చవుతూ కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయని గ్రామపెద్దలు పేర్కొన్నారు. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోవడం, మహిళలు వేధింపులకు గురికావడం, కుటుంబ కలహాలు పెరగడం వంటి సమస్యలకు మద్యమే ప్రధాన కారణమని గ్రామసభలో అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం కేవలం బెల్ట్‌షాపులు మూసివేయడానికే పరిమితం కాదని, గ్రామంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నెలకొల్పే సామాజిక ఉద్యమానికి శ్రీకారమ ని సర్పంచ్‌ తెలిపారు. గ్రామప్రజల సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రామచంద్రాపూర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. గ్రామస్తులే ముందుండి సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ తీర్మానం విజయవంతమైతే గ్రామీణ సమాజంలో కొత్త మార్పుకు నాంది పలికే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

రోజంతా కష్టపడి సంపాదించిన కూలీ డబ్బాంతా మద్యం కోసం ఖర్చు చేయడంతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇంట్లో గొడవలు, పిల్లల చదువులపై నిర్లక్ష్యం పెరిగాయి. గ్రామసభ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు పెద్ద ఊరటనిస్తుంది.

– రాజేశ్వరి, మహిళా సంఘం బుక్‌ కీపర్‌

బెల్ట్‌ షాపులు మూసివేస్తేనే గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మ హిళలు, యువత, గ్రామ పెద్దలంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలి. ఇది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలి.

– కుర్వ బాలేశ్వరి, గృహిణి

మద్యం వ్యసనంతో ఎంతోమంది యువకులు తమ లక్ష్యాలను కోల్పోతున్నా రు. గ్రామంలో బెల్ట్‌ షాపు లు లేకపోతే యువత క్రీడ లు, ఉపాధి, చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని యువత పూర్తిగా సమర్థిస్తోంది.

– సౌట కుర్మయ్య, గ్రామస్తుడు

మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయి. గ్రామ ప్రజలందరి అభిప్రాయాలను తీసుకున్న త ర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు.. గ్రామ భ విష్యత్‌ కోసం తీసుకున్న సామాజిక నిర్ణయం. అందరిసహకారంతో రామచంద్రాపూర్‌ను సంపూర్ణ మద్యపాన నిషేధంగా తీర్చిదిద్దుతాం.

– నర్సింహులు, సర్పంచ్‌, రామచంద్రాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement