గతంలో మాదిరిగానే ఎంపికలు
ఉమ్మడి జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లు కరువు
● 40 వేల మందికిపైగా విద్యార్థులు..
అండర్–19 ఎస్‌జీఎఫ్‌పై సందిగ్ధం
● పాఠశాలల్లో త్వరలో ఎస్‌జీఎఫ్ పోటీలు.. కళాశాలల్లో మాత్రం అయోమయం
● పీడీల నియామకంతోనే క్రీడలకు
ఊతమంటున్న క్రీడావర్గాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 63 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా కళాశాలల్లో 40 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నా.. క్రీడలకు మార్గనిర్దేశం చేసే సిబ్బంది లేకపోవడంతో క్రీడా ప్రతిభకు అవకాశం దక్కడం లేదు. ముఖ్యంగా ప్రతి ఏటా నిర్వహించే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీల నిర్వహణపైనా దీని ప్రభావం పడుతోంది.
అండర్–19 క్రీడలపై సందిగ్ధం
పాఠశాల స్థాయిలో అండర్–14, అండర్–17 ఎస్‌జీఎఫ్ పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే జూనియర్ కళాశాల విద్యార్థులకు సంబంధించిన అండర్–19 ఎస్‌జీఎఫ్ పోటీలపై ఈ ఏడాది ఇప్పటివరకు స్పష్టత లేదు. గత విద్యాసంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లా పాఠశాల ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్–19 ఎంపికలు నిర్వహించారు. కళాశాలల్లో పీడీలు లేకపోవడంతో ఈ బాధ్యతను పాఠశాల స్థాయి సిబ్బందే నిర్వహించాల్సి వచ్చింది. అండర్–19లో జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని.. ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే కళాశాలల్లో క్రీడా శిక్షణ, సాధనకు పీడీలు లేకపోవడంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి.
పీడీలు ఉంటేనే ప్రోత్సాహం
పాఠశాల స్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపుతున్నా.. ఇంటర్ స్థాయికి వచ్చేసరికి అండర్–19 విభాగంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదని క్రీడా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. క్రీడాకారులను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, పోటీలకు సిద్ధం చేయడం వంటి అంశాలకు పీడీల పాత్ర కీలకమని పేర్కొంటున్నారు. జూనియర్ కళాశాలల్లో పీడీలను నియమిస్తే క్రీడలకు ఊతం లభించడంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించే అవకాశం ఉంటుందంటున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం పీడీలు లేరు. అండర్–19 ఎస్‌జీఎఫ్ క్రీడలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సూచనలు రాలేదు. గతంలో మాదిరిగానే పాఠశాల ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్–19 ఎంపికలు నిర్వహించే అవకాశం ఉంది.
– సి.రమణి, డీఐఈఓ, మహబూబ్‌నగర్


