● మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశం
దేవరకద్ర/పాలమూరు: దేవరకద్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల (టీహెచ్‌ఎస్‌డబ్ల్యూ ఆర్‌ఎస్/జేసీ)లో సోమవారం రాత్రి ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యం విద్యార్థిని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను సమీక్షించారు. విద్యార్థి చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
గురుకుల నిర్వహణపై జోనల్ అధికారి ఆగ్రహం
కాగా.. చౌదర్‌పల్లి గ్రామ సమీపంలో స్విట్స్ కళాశాల భవనంలో ఉన్న గురుకులం నిర్వహణ తీరుపై జోనల్ అధికారి వి ద్యాలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవరణ అంతా పిచ్చి మొక్కలు పెరగడం, పరిసరాలలో అపరిశుభ్రత, బాత్రూంలకు డోర్లు లేకపోవడంపై ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.


