దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిమట్టం శరవేగంగా పెరుగుతుంది. జూరాల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంద్యాల పంపుహౌజ్ నుంచి రెండు పంపులను రన్ చేసి 630 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. పది రోజుల క్రితం వరకు 9 అడుగులకు పడిపోయిన నీటిమట్టం శుక్రవారం సాయంత్రం వరకు 14.6 అడుగులకు చేరుకుంది. మరో 5.6 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నీటిని వదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో ముందుగానే నీటిని వదిలే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు రెండు, మూడో వారం వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగి పోయారు. ఇప్పటికే బోరు బావుల కింద వరినాట్లు వేసుకున్న రైతులు ఆయకట్టుకు నీరు వదిలితే పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు.


