చురుకై న ఆలోచనతోనే
ముందడుగు
● విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్
● కష్టపడి చదివితే అద్భుత భవిష్యత్.. స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలతో ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బాసర ట్రిపుల్‌ఐటీ వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ అన్నారు. కష్టపడి చదివి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. మహబూబ్‌నగర్ బీకేరెడ్డి కాలనీలోని ట్రిపుల్‌ఐటీ కొత్త క్యాంపస్‌లో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని వీసీ సూచించారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగంతో విలువైన సమయం వృథా కాకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. అవసరమైతే విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లకు బదులుగా కీప్యాడ్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వారి యోగక్షేమాలను తెలుసుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బాసర ట్రిపుల్‌ఐటీ ఒకటని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో ఐదు ప్రాంతాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో గతేడాది 200 మంది విద్యార్థులతో బోధన ప్రారంభించగా.. ఈ ఏడాది మరో 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం 33 వేల మంది విద్యార్థులు పోటీ పడగా.. కేవలం 1,800 మందికి మాత్రమే అవకాశం లభించిందని తెలిపారు. దీనిని బట్టి సంస్థకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజనం, విద్యాబోధన విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని అంశాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాధ్యతగా మెలగాలని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
ట్రిపుల్‌ఐటీ పరిపాలన అధికారి మురళీదర్శన్ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చురుకుగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రవణ్‌కుమార్, విశిష్ట అతిథి విఠట్, సైకాలజిస్టు శ్రీనివాస్, అధ్యాపకులు పసునూరి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


